దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు .. ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు

దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు .. ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు

మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. సోమవారం మెదక్​కలెక్టర్​ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి మొత్తం 74 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిలో భూ సమస్యలు-23, పింఛన్లు 4, ఇందిరమ్మ ఇళ్లు 9, ఉపాధి 1, ఇతర సమస్యలు -37 వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా ప్రజావాణి ఉండాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య,  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సంగారెడ్డి: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి అని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో అడిషనల్​కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, డీఆర్ వో పద్మజారాణి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 73 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. వాటన్నిటిని వేగంగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినతులకు తప్పకుండ పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని అధికారులు కలిగించాలని సూచించారు. 

బయోమెట్రిక్ విధానాన్ని పాటించాలి

కలెక్టరేట్ లో​అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్​లో పనిచేసే అధికారులు సమయపాలన పాటిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. బయోమెట్రిక్ కోసం ఇంకా రిజిస్టర్ చేసుకోని అధికారులు త్వరగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్ అనుసరించకపోతే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సిద్దిపేట టౌన్: ప్రజావాణికి వచ్చే వినతులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్​తో కలిసి ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి  ప్రజలు వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలన్నారు. ప్రజావాణి మొత్తం 49 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

రోడ్డును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

శివ్వంపేట: మండలంలోని చిన్న గొట్టిముక్కులలో పొలాలకు వెళ్లే రోడ్డును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు ప్రజావాణిలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్​ 292లో ఎస్టీలు, బీసీ రైతులకు చెందిన 95 ఎకరాలు, సర్వే నెంబర్​ 264, 274, 275, 276లో సుమారు 55 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. ఆయా పొలాలకు, గిరిజన తండాకు వెళ్లేందుకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డు ఉందన్నారు.

 గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనికి ఆహార పథకం కింద సుమారు రూ.30 లక్షల వ్యయంతో వేసిన  ఆ రోడ్డును ఇటీవల కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు మద్దతిస్తున్న పలువురు స్థానిక నాయకులు తవ్వేసి తాము పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా చేశారని తెలిపారు. అలాగే సదరు మాజీ ప్రజాప్రతినిధి చిన్న గొట్టిముక్కుల భయాన చెరువు, కుమ్మరి కుంట శిఖంను కబ్జా చేశారని కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని తమకు అనుకూలంగా రికార్డులు మార్పించుకున్నారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని రైతులు కలెక్టర్​ను కోరారు.