రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిమేని గోపి

రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిమేని గోపి

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రిజర్వేషన్​పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డిమేని గోపి ఆరోపించారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు తెలిపారని చెప్పారు. 

రాష్ట్ర బంద్ కు ఒకరోజు ముందు డీసీసీ అధ్యక్షుడు, విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో పెట్టిన ప్రెస్​మీట్​లో బీసీ బిల్లును బీజేపీ అడ్డుకుంటుందని మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎంపీ బండి సంజయ్ 42 శాతం రిజర్వేషన్లలో కేవలం బీసీలు మాత్రమే ఉండాలని, 10 శాతం ముస్లింలను బీసీల్లో చేర్చవద్దని తన అభిప్రాయాన్ని చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు బీసీ నాయకులతో కలిసి ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. 

పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన కోర్టు పైనా.. రాజ్యాంగం ప్రకారం జీవో ఎలా ఇవ్వాలో తెలియని సీఎం రేవంత్ రెడ్డి పైనా అని ఎద్దేవా చేశారు. బీసీ ప్రజలను మభ్య పెట్టడం కోసమే కాంగ్రెస్  డ్రామాలాడుతుందన్నారు. కాంగ్రెస్ చెబుతున్న రిజర్వేషన్ ప్రకారం రాష్ర్ట మంత్రివర్గంలో 8 మంది బీసీలు మంత్రులుగా ఉండాలని, కానీ ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్​చేశారు. బీసీలపై ప్రేముంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్​నిధులు విడుదల చేయాలన్నారు.