పహల్గాం టెర్రరిస్టుల జాడ ఎక్కడ... ముష్కరులను చంపేశారా లేక అరెస్టు చేశారా: కాంగ్రెస్ డిమాండ్

పహల్గాం టెర్రరిస్టుల జాడ ఎక్కడ... ముష్కరులను చంపేశారా లేక అరెస్టు చేశారా: కాంగ్రెస్  డిమాండ్
  • కేంద్రం జవాబు చెప్పాలని కాంగ్రెస్  డిమాండ్

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టులను ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని కాంగ్రెస్  పార్టీ డిమాండ్  చేసింది. గత నెల 22న పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న ముష్కరులను చంపేశారా లేక అరెస్టు చేశారా అన్నది ఇంతవరకూ తెలియలేదని, అసలు ఉగ్రవాదుల జాడ ఎక్కడని నిలదీసింది. సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి భూపేశ్  బఘేల్  మీడియా సమావేశంలో మాట్లాడారు. పహల్గాంలో భద్రతా వైఫల్యం ఎలా జరిగిందని ఆయన నిలదీశారు. భారత్, పాకిస్తాన్  వ్యవహారంలో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి ఫారెన్  పాలసీలో ఏమైనా మార్పులు చేశారా అని ప్రశ్నించారు. 

ఆపరేషన్  సిందూర్  తర్వాత భారత్, పాక్  కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  ప్రకటించారని, మన దేశ అంతర్గత వ్యవహారంలో ట్రంప్  ఎలా జోక్యం చేసుకుంటారని నిలదీశారు. పహల్గాం టెర్రర్  దాడిని బీజేపీ రాజకీయం చేస్తోందని, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. ‘‘ఆపరేషన్  సిందూర్, కాల్పుల విరమణ పరిణామాల తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్  చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు సమావేశం ఏర్పాటు చేయడం లేదు? ఒకవేళ మీటింగ్  పెట్టినా మోదీ హాజరు కావాలి. 

లేకపోతే మా పార్టీ (కాంగ్రెస్) అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే కూడా హాజరుకారు. 1971లో పాకిస్తాన్ తో యుద్ధం సమయంలో భారత్  అంటే ఏమిటో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రపంచానికి చాటిచెప్పారు. అప్పుడు ఏ దేశం ముందు కూడా భారత్  తల వంచలేదు. అమెరికా ఒత్తిడి చేసినా ఇందిరా గాంధీ తలొగ్గకుండా పాకిస్తాన్ ను ఓడించారు. ఆపత్కాలంలో మా పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి జాతి ప్రయోజనాల కోసం పనిచేసింది. 

ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో సరిహద్దుల వద్ద మన బలగాలు పనిచేస్తున్నాయి” అని బఘేల్  వ్యాఖ్యానించారు. అమెరికా ఒత్తిడి వల్ల మన విదేశాంగ విధానంలో ఏమన్నా మార్పులు చేశారా అని ఆయన ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడికి ఎందుకు తలొగ్గుతున్నారని, కౌంటర్  ఎందుకు వేయడం లేదని నిలదీశారు.