వ్యవసాయాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్

వ్యవసాయాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్

సాగు చట్టాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ప్రతిపక్షాలు, అటు రైతు సంఘాలు.. సాగు చట్టాల్లో ఒక్క లోపాన్ని కూడా ఎత్తి చూపలేకపోయాయన్నారు.శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అన్నారు. బీజేపీ ఎప్పుడూ అలా చేయదని చెప్పారు.

ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు తోమర్. చట్టాల్లో సవరణలు చేసేందుకూ సిద్ధమేనని, అలాగని ఆ మూడు చట్టాల్లో లోపాలున్నట్టు కాదన్నారు. కేవలం ఒక రాష్ట్రానికి చెందిన రైతులే ఆందోళనలు చేస్తున్నారని.. వారికి కావాలనే తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లు రైతుల భూములను లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఒప్పంద వ్యవసాయంలో రైతు భూమిని లాక్కునేలా చట్టంలో ఎక్కడైనా నిబంధనలున్నాయేమో చూపించాలని సవాల్ విసిరారు. చట్టాలతో రైతులకు లాభం తప్ప ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు మంత్రి  తోమర్.