
హర్యానా ఎన్నికల
ప్రచారంలో మోడీ విమర్శ
గురు నానక్ 550 జయంతికి ఘనంగా ఏర్పాట్లు
ఎల్లెనాబాద్/రేవారీ (హర్యానా): ఎన్నికల ప్రచారం ఆఖరు రోజైన శనివారంనాడు హర్యానాలోని పలు ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఎటాక్ చేశారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలు, స్ట్రాటజీ వల్లే ‘‘దేశం ధ్వంసం అయిందని’’ ఆరోపించారు. ఎల్లెనాబాద్ సభలో మాట్లాడిన ప్రధాని ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావించారు. అంబేద్కర్ దీన్ని టెంపరరీ ప్రొవిజన్ కింద పెడితే… కాంగ్రెస్ దాన్ని 70 ఏళ్ల వరకు కొనసాగించిందని విమర్శించారు. ‘‘ఢిల్లీలో అధికారం కోసం కాశ్మీర్‌ను ధ్వంసం చేయడానికి అవకాశం కల్పించాలా?. కాశ్మీర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలా? లేకుంటే ప్రధాని పోస్ట్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా?. ప్రధానులు వస్తారు, వెళ్తారు. కాశ్మీర్ మాత్రం సౌభాగ్యవంతంగానే ఉండాలని ప్రతి ఇండియన్ సమాధానం చెప్తాడు’’ అని మోడీ అన్నారు.
స్పెషల్ స్టేటస్ రద్దుకు బీజేపీ సర్కార్ చర్యలు మొదలు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తూనే ఉందని ప్రధాని విమర్శించారు. ఆర్టికల్ 370ని రద్దుచేస్తామని 1964 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినా దాన్ని నెరవేర్చడంలో ఆపార్టీ ఫెయిల్ అయిందని ప్రధాని విమర్శించారు. గురు నానక్ 550 జయంతిని ఘనంగా జరిపేందుకు కేంద్రం ఏర్పాట్లను చేస్తోందని ఆయన అన్నారు. కర్తార్‌పూర్ గురుద్వారాను మన భూభాగంలో చేర్చకపోవడం దేశ విభజన సమయంలో జరిగిన పెద్ద తప్పని మోడీ అన్నారు. బీజేపీ సర్కార్ అమలుచేసిన వన్ ర్యాంక్- వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) స్కీమ్ కింద హర్యానాలోని సుమారు రెండు లక్షల మంది మాజీ సైనికులకు 900 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.
రాహుల్ ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తారా?: అమిత్ షా
నవపూర్ (మహారాష్ట్ర): అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 ని మళ్లీ తెస్తారా అని కాంగ్రెస్ లీడర్ రాహుల్‌గాంధీని కేంద్రహోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ట్రైబల్ జిల్లా నందుర్‌బార్ లో శనివారం ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ స్పెషల్ ప్రొవిజన్స్ వల్ల జమ్మూకాశ్మీర్‌లో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించింది. దీని వల్ల 40 మంది చనిపోయారు. కాశ్మీర్‌లో అభివృద్ధి ఆగిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ ఆ ప్రొవిజన్స్ రద్దుచేయడానికి ముందుకు రాలేదు. ఓటు బ్యాంక్ ఏమవుతుందోనని కాంగ్రెస్ బెంగపడిందేకాని, ఆపార్టీకి నేషనల్ ఇంట్రెస్ట్ ఏమాత్రంలేదు’’ అని అమిత్ షా చెప్పారు. ట్రైబల్ డెవలప్‌మెంట్ పాలసీలో భాగంగా దేశంలోని 115 జిల్లాల్లో నందుర్‌బార్ కూడా ఉందన్నారు. గిరిజనుల వెల్ఫేర్‌కు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. ‘‘గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కోసం స్మారకాలను కట్టాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. దీంతోపాటు ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను కూడా ప్రారంభిస్తున్నాం’’ అని బీజేపీ ప్రెసిడెంట్ చెప్పారు.