కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ

కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ

మర్రి శశిధర్ రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలవటంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. 

నిన్న మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయనతో చెప్పినట్లు తెలిసింది. సహచరులతో చర్చించి మరో వారం రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారని సమాచారం. 

మరో వైపు  మర్రి శశిధర్ రెడ్డి  తన ట్విట్టర్ హ్యాండిల్లో Always Congress Man అనే పదాన్ని తొలగించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలకు  మరింత బలం చేకూరినట్లైంది. రెండు మూడు రోజుల్లో మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఆయన జేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు స్వయంగా వెల్లడించారు.