తెలంగాణపై ఫోకస్..​ పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్

తెలంగాణపై ఫోకస్..​ పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్
  • తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా
  • దక్షిణాదిలో రాష్ట్రంపైనే రెండు జాతీయ పార్టీల భారీ అంచనాలు
  • సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్​ చేస్తున్న హైకమాండ్​లు
  • ఉనికి చాటుకునేందుకు బీఆర్​ఎస్​ ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: ఈ సారి రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలపై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి. ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలువాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే తాము అధికారంలోకి వచ్చినందున తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పక్కాగా 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్​ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక.. దక్షిణాదిలో తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెలిచి, మోదీకి గిఫ్ట్​గా ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్​ఎస్​ పార్టీ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడింది. ఒకరొకరుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి వెళ్తున్నారు. కాగా.. కాంగ్రెస్​, బీజేపీ జాతీయ నాయకత్వాలు ఎప్పటికప్పుడు తెలంగాణలోని లోక్​సభ సీట్లపై సమాచారాన్ని తెప్పించుకొని అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. 

దూసుకుపోతున్న కాంగ్రెస్​

తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్​ హైకమాండ్​ మొదటి నుంచి నమ్మకంతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా జనంలో మంచి ఆదరణ ఉందని, వందరోజుల్లోనే  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారంటీలు ప్లస్​ అవుతాయని భావిస్తున్నది. మూడు రోజుల కింద హైదరాబాద్​ శివారు తుక్కుగూడ వేదికగా పార్టీ జాతీయ మేనిఫెస్టో ‘పాంచ్​ న్యాయ్​’ను రాహుల్​గాంధీ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో ఇదే వేదికగా ఆరు గ్యారంటీలను సోనియాగాంధీ ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. 

అదే సెంటిమెంట్​తో ఇప్పుడు అక్కడే జాతీయ మేనిఫెస్టోను ప్రకటించడం కలిసి వస్తుందని, ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్​ నేతలు బలంగా నమ్ముతున్నారు. జనజాతర సభ సక్సెస్​ అయిందని, సభ వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోకు మంచి స్పందన వస్తున్నదని వాళ్లు చెప్తున్నారు. 14కు తగ్గకుండా రాష్ట్రం నుంచి ఎంపీలను అందిస్తామని తుక్కుగూడ సభా వేదికగా సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. 

కాగా, లోక్​సభ సెగ్మెంట్లపై రేవంత్​రెడ్డి రివ్యూలు చేస్తూ.. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ‘‘పక్కాగా  మనం 14 సీట్లు గెలుస్తామని రిపోర్ట్​ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ వేవ్​ కొనసాగుతున్నది. ఇంకింత కష్టపడితే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో స్వీప్​ చేయొచ్చు. ఏ ఒక్క ఎంపీ సీటును కూడా ఆషామాషీగా తీసుకోవద్దు. జాతీయ మేనిఫెస్టోను ముఖ్యంగా మహిళలకు ప్రకటించిన రూ. లక్ష స్కీమ్​ను జనంలోకి తీసుకెళ్లాలి. రాహుల్​గాంధీని ప్రధానిగా చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు” అని సూచించారు. 

గ్రౌండ్​లో ప్రత్యేక టీమ్​లు

వ్యూహకర్త సునీల్​ కనుగోలుతోపాటు ఏఐసీసీ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్​, రాహుల్​ టీమ్​ రాష్ట్రంలో పర్యటిస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో రాష్ట్ర నేతలకు హైకమాండ్​ దిశానిర్దేశం చేస్తున్నది. 2019 లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్​ ఇప్పుడు 14 సీట్లను పక్కాగా గెలుస్తామన్న ధీమాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ వచ్చి ఆరు గ్యారంటీలు ప్రకటించడం, ప్రియాంక గాంధీ బహిరంగ సభలు, రోడ్​ షోల్లో పాల్గొనడం, రాహుల్​ భారత్​ జోడో యాత్ర నిర్వహించడం, మూడు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడే జరగడం, మూడురోజుల కింద జాతీయ మేనిఫెస్టోను కూడా ఇక్కడే విడుదల చేయడం వంటివన్నీ తెలంగాణకు కాంగ్రెస్​ హైకమాండ్​ ఇస్తున్న ప్రయారిటీకి నిదర్శనమని ఓ ముఖ్య నేత అన్నారు. హైకమాండ్​ నమ్మకానికి తగ్గట్టుగా తాము వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని, వేవ్​ను చూస్తూ స్వీప్​ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. 

ఉనికి చాటుకునే పనిలో బీఆర్ ఎస్

జాతీయ స్థాయి పార్టీగా ఎదగాలనుకున్న బీఆర్​ఎస్​ ఆశలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అడుగంటాయి. ప్రస్తుతం లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీలో పెద్దగా జోష్​ కనిపించడం లేదు. గత ఎంపీ ఎన్నికల్లో తొమ్మిది సీట్లను బీఆర్​ఎస్​ గెలువగా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో మిగిలిన సిట్టింగ్​ ఎంపీలు కేవలం ఇద్దరే. తొమ్మిది మందిలో ఒకరు ఎమ్మెల్యేగా గెలువగా.. ఆరుగురు ఎంపీలు కాంగ్రెస్​, బీజేపీలో చేరారు. 

గ్రామ స్థాయిలో సర్పంచులు, మున్సిపాలిటీల్లోని నేతలు కూడా చాలా మంది గులాబీ పార్టీని వదలారు. ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారు. పైగా.. లిక్కర్​ స్కామ్​, ఫోన్​ ట్యాపింగ్​ వెంటాడుతుండటం, పదేండ్ల కాలంలోని అక్రమాలు బయటకు వస్తుండటంతో బీఆర్​ఎస్ ఉక్కిరిబిక్కిరవుతున్నది.

హ్యాట్రిక్​ నినాదంతో బీజేపీ

హ్యాట్రిక్​ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తున్నది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి. దేశంలో పార్టీ 300 సీట్ల మార్క్​ దాటడానికి తెలంగాణ సీట్లు కలిసి వచ్చాయని బీజేపీ నేతలు అంటుంటారు. ఇప్పుడు పది నుంచి 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘అబ్​ కీ బార్​ చార్​ సౌ పార్​’ పేరుతో దేశమంతా బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నది. ఆ నినాదం సక్సెస్​ కావాలంటే  తెలంగాణలో పక్కాగా డబుల్​ డిజిట్​ సీట్లు గెలువాలని జాతీయ నాయకత్వం ఇక్కడి నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానం ఉంటుందని అంచనా వేశారు. దీన్ని బట్టి రాష్ట్రంలో తప్పకుండా తాము పదికిపైగా సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. 

తుక్కుగూడ సభ సక్సెస్​తో.. 

రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. 14 సీట్లకు కాంగ్రెస్​ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరో మూడు సీట్లకు త్వరలో ప్రకటించనుంది. తుక్కుగూడ జన జాతర సభ ద్వారా ఆ పార్టీ లోక్​సభ ఎన్నికల శంఖం పూరించింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారి వెంట సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. త్వరలోనే ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్​గాంధీ, ప్రియాంకగాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, వీలైనన్ని ఎక్కువ సభలకు వారు వస్తారని రాష్ట్ర లీడర్లు చెప్తున్నారు. సోనియాగాంధీని కూడా ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు. 

గ్రౌండ్​లో నమో టీమ్​ 

‘నమో’ టీమ్​ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ నాయకత్వానికి రిపోర్ట్​ చేస్తున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పెద్దలు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్​ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ రాష్ట్రానికి రెండుసార్లు వచ్చి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరుకానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.  దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు పార్టీ హైకమాండ్​ ప్రయారిటీ ఇస్తున్నదని, అందుకు తగ్గట్టుగా పదికిపైగా సీట్లు గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని బీజేపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.