మోదీ.. జనానికి దూరమైన చక్రవర్తి: ప్రియాంక గాంధీ

మోదీ.. జనానికి దూరమైన చక్రవర్తి: ప్రియాంక గాంధీ
  • దిగజారి మాట్లాడుతున్నరు: ప్రియాంక గాంధీ
  • మోదీ గుజరాత్ ప్రజలను వాడుకుని వదిలేశారు
  • కాంగ్రెస్ ప్రజల ఆస్తులను ఎన్నడైనా లాక్కున్నదా? 
  • మోదీ అబద్ధాలు పెరిగిపోయాయని ఫైర్    

లఖానీ(గుజరాత్):  ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దూరమైన చక్రవర్తి (షెహన్షా) అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఆయన గుజరాత్ ప్రజలను వాడుకుని వదిలేశారని, అందుకే యూపీ నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు. శనివారం గుజరాత్​లోని బనస్కాంత లోక్ సభ నియోజకవర్గంలోని లఖానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు.

తన అన్న, కాంగ్రెస్ మాజీ చీఫ్ ​రాహుల్ గాంధీని యువరాజు(షహజాదా) అంటూ మోదీ సంబోధిస్తున్న నేపథ్యంలో ఆయనకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నా అన్నను షహజాదా అని మోదీ పిలుస్తున్నారు. కానీ ఈ షహజాదా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను విన్నారు. మీలాంటి నా సోదర సోదరీమణులను, రైతులను, కార్మికులను కలిశారు.

వారి సమస్యల పరిష్కారం కోసం పాలకులు ఏం చేయాల్నో అడిగి తెలుసుకున్నారు. కానీ మోదీజీ.. మీరు షహన్షా. ప్యాలెస్​లో నివసిస్తూ ప్రజలకు దూరమయ్యారు” అని ఆమె విమర్శించారు. ‘మోదీని ఎప్పుడైనా టీవీల్లో చూశారా? చొక్కా మడత నలగకుండా, జుట్టు చెదరకుండా 
కనిపిస్తారు. ధరలు పెరిగిపోయి విపరీతమైన భారం మోస్తున్న మీ సమస్యలను ఆయన ఎలా అర్థం చేసుకుంటారు?” అని ప్రజలను ప్రశ్నించారు.

మన ఎన్నికల్లో పాక్ ప్రస్తావన ఎందుకు? 

రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాసేందుకే దానిని మార్చాలంటూ అనేక మంది బీజేపీ నేతలు చెప్తున్నారని ప్రియాంక అన్నారు. ‘‘మోదీ అధికార మత్తులో ఉన్నారు. అందుకే మిమ్మల్ని మరిచిపోయారు. గుజరాత్ ప్రజలకు దూరం కాకపోతే ఆయన ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయడంలేదు? ఆయన మిమ్మల్ని వాడుకున్నారు. అధికారం సంపాదించారు. ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసిపోయారు” అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాకిస్తాన్ కోరుకుంటోందన్న మోదీ కామెంట్లనూ ప్రియాంక ఖండించారు. 

‘‘ఎన్నికలు ఇండియాలో జరుగుతున్నాయి. కానీ మాట్లాడుతున్నది మాత్రం పాకిస్తాన్ గురించి. దేశ ప్రధాని ఇంతగా దిగజారి మాట్లాడతారా? దేశ గౌరవాన్ని నిలబెట్టేందుకే మీరు ఒక ప్రధానిని ఎన్నుకున్నారు. కానీ ఆయన మాటలు జుగుప్సను కలిగిస్తున్నాయి” అని ఆమె విమర్శించారు. 

మోదీ అబద్ధాలు పెరిగిపోయినయ్ 

ప్రధాని మోదీ అబద్ధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రియాంక అన్నారు. ‘‘ఆయన గతంలో అబద్ధాలు తక్కువగా చెప్పేవారు. కానీ ఇప్పుడు మీకు ఉన్న రెండు బర్రెల్లో ఒక దానిని, మీ ఇంట్లో ఉన్న నగలను కాంగ్రెస్ దొంగిలిస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ 55 ఏండ్లు అధికారంలో ఉంది. ఎప్పుడైనా మీ బర్రెను గానీ, మీ ఇంట్లో నగలను కానీ లాక్కున్నదా?” అని ఆమె ప్రశ్నించారు.

కాంగ్రెస్ రైతుల కోసం అమూల్, బనస్ డైరీలను ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు బీజేపీ నేతలు ఆ సెక్టార్ ను క్యాప్చర్ చేయాలని చూస్తున్నారన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏండ్లలోనే అత్యధికంగా పెరిగిందని చెప్పారు. బిలియనీర్ల సంపదను మరింతగా పెంచేందుకు ఏదైనా సరే చేయాలన్నదే మోదీ సర్కారు పాలసీగా మారిపోయిందన్నారు. బీజేపీ ప్రపంచంలోనే రిచెస్ట్ పార్టీగా అవతరించిందని, ఆ పార్టీ సర్కారు తెచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక కరప్షన్ స్కీం అని ప్రియాంక గాంధీ ఆరోపించారు.