- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్, వెలుగు : కేసీఆర్ బయటకు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి రైతుబంధు వేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాలకు సోమవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. 22 రోజుల నుంచి వడ్లు, మక్కలు కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు లేని సమస్యలు.. ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. బుస్సాపూర్‌కు లిఫ్ట్ మంజూరు చేశామని, 90 శాతం పనులు తాను మంత్రిగా ఉన్న సమయంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తట్టేడు మట్టి కూడా ఎత్తలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ రామసాగర్ ఐలారెడ్డి పాల్గొన్నారు.
