
- బేవరేజెస్, సివిల్ సప్లయ్స్, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్,
- విజయ డెయిరీ తదితరాల్లో గోల్ మాల్
- ప్రభుత్వానికి అందిన రిపోర్టు.. సమగ్ర విచారణకు ఆదేశించే యోచన
- విజిలెన్స్ ఎంక్వైరీనా? ఏసీబీకి అప్పగించాలా? అనే దానిపై త్వరలో నిర్ణయం
- ఇన్నేండ్లు కార్పొరేషన్లలో చక్రం తిప్పిన మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ కార్పొరేషన్లలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు సర్కార్ గుర్తించింది. రూ.వేల కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్లలో పదేండ్ల పాటు అవినీతి తంతు కొనసాగినట్టు గుర్తించింది. ఓవైపు కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయని చెబుతూనే.. మరోవైపు అప్పుల రూపంలో తీసుకున్న నిధులు, వాటిల్లో ఎంతో కొంత వచ్చిన ఆదాయాన్ని కూడా అక్రమార్కులు కొట్టేసినట్టు తెలుసుకుంది.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల దగ్గరి నుంచి ఆయా కార్పొరేషన్లు నిర్వహించే వివిధ రకాల పనుల వరకు అన్నింటిలో గోల్ మాల్ జరిగినట్టు నిర్ధారించింది. ఆఖరికి పంటలను కొనుగోలు చేసి, వాటిని టెండర్లు వేసి విక్రయించే విధానంలోనూ నిధుల మేత జరిగినట్లు గుర్తించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారాల్లో కేసీఆర్ సన్నిహితులే ఉన్నారని ప్రభుత్వం తెప్పించుకున్న ప్రిలిమినరీ రిపోర్టులో వెల్లడైంది.
సివిల్ సప్లయ్స్, బేవరేజెస్ (ఎక్సైజ్), వేర్‌హౌసింగ్(గిడ్డంగులు), తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, విజయ డెయిరీ, టీఎస్ఐఐసీ, సీడ్, షీప్, ఫిషరీస్ ఫెడరేషన్లు, హ్యాండ్లూమ్స్, టీఎస్ ఫుడ్స్, ఆగ్రోస్, ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెస్ట్ డెవలప్ మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్అథారిటీ, మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ తదితరాల్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగినట్టు రిపోర్టులో తేలింది.
వీటన్నింటిపై విజిలెన్స్ఎంక్వైరీ వేయడమా? లేదంటే ఏసీబీకి అప్పగించడమా? అనే దానిపై సర్కార్త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా, ఆయా కార్పొరేషన్లకు త్వరలోనే చైర్ పర్సన్లను నియమించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ముందు గత సర్కార్వ్యవహారాలను బయటపెట్టాలని అనుకుంటున్నది.
మార్క్ ఫెడ్ లో క్విడ్ ప్రో కో..
మార్క్ఫెడ్సంస్థ ప్రభుత్వం తరఫున నోడల్ఏజెన్సీగా ఉండి పంటలు కొనుగోలు చేస్తుంది. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర రానప్పుడు సర్కార్అనుమతితో మక్కలు, శనగలు, వేరుశనగ, జొన్నలు, కందులు తదితర పంటలను కొంటుంది. అయితే వాటిని తిరిగి ట్రేడర్స్‌కు విక్రయించే టైమ్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్టు సర్కార్ గుర్తించింది.
టెండర్లలో మతలబు చేసి తక్కువ రేటుకే అమ్ముడుపోయేలా వ్యవహారం నడిపినట్టు నిర్ధారించింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు క్విడ్‌ప్రోకో మాదిరి ఈ అవినీతికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో మార్క్ఫెడ్సంస్థ దాదాపు రూ.3 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇందులో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ హస్తం ఉన్నట్టు తెలిసింది. ఇక సీఎంఆర్ వ్యవహారంలో రూ.వందల కోట్లు చేతులు మారినట్టు గుర్తించింది.
మద్యం అమ్మకాల్లో మతలబు..
బేవరేజెస్ కార్పొరేషన్‌లోనూ గుట్టుచప్పుడు కాకుండా చాలా వ్యవహారాలు నడిచాయి. సాధారణంగా సప్లయర్స్వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. అయితే గతంలో ఎక్సైజ్ శాఖను చూసిన మినిస్టర్ 30 శాతం మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ కట్టేలా నిబంధన తీసుకొచ్చారు. మిగిలిన మొత్తం అమ్మకాల తర్వాత చుద్దాంలే అనే విధంగా చేయడంతో, ఇందులో మతలబు జరిగినట్టు ప్రభుత్వం భావిస్తున్నది.
సరిగ్గా ఎన్నికలకు ముందు అడ్వాన్స్ చెక్కులతో దాదాపు రూ.500 కోట్ల మద్యం లిఫ్ట్చేయించారు. ఈ వ్యవహారంలోనూ కోట్లు చేతులు మారినట్టు ప్రభుత్వం గుర్తించింది. సప్లయర్స్‌కు రేట్లు పెంచే దానిపై టెండర్ల కమిటీ ఉంటుంది. టెండర్ల కమిటీ లేకుండానే ఇష్టారీతిన ప్రపోజల్స్ పంపడం ద్వారా కొందరికి మేలు చేశారని తెలిసింది. మద్యం బాటిళ్లపై లేబుల్ కోసం ట్రాక్ అండ్ ట్రేస్ ఇన్వెంటరీ సాఫ్ట్ వేర్ ఫ్రీగా ఇస్తామని సీటెల్ కంపెనీ ముందుకొచ్చింది.
ఆ టైమ్ లో పేపర్ లేబుల్ ఖర్చు 17 పైసలు అవుతుందని నిర్ధారించారు. తర్వాత సీటెల్ కంపెనీ ప్లాస్టిక్ లేబుల్ తీసుకొచ్చింది. ముందు 17 పైసలకే ఒప్పందం చేసుకుని, దాన్ని తర్వాత 40 పైసలకు తీసుకెళ్లారు. దీని కింద నెలకు రూ.20 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ.1,200 కోట్ల మేర గోల్మాల్జరిగినట్టు తెలిసింది. .
ఆయిల్ ఫెడ్ లోనూ అక్రమాలు..
ఆయిల్‌ఫెడ్ సంస్థలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. ఆయిల్ పామ్సాగుకు సంబంధించి వివిధ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన ఏరియా, జిల్లాల అలాట్మెంట్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆయిల్‌ఫెడ్ సంస్థ ‘కిన్నెర’ పేరుతో వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.3 కోట్లతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, అనుమతులు తీసుకుని మార్కెట్లోకి ప్రవేశించింది. అర లీటర్ బాటిల్ ధర రూ.10గా, లీటర్ బాటిల్ ధర రూ.20గా నిర్ణయించింది. అయితే వీటి సేల్స్‌ను మాత్రం వదిలేసింది. తక్కువ ఖర్చుకే మిషనరీ తీసుకొచ్చి నిధులు గోల్మాల్ చేసినట్టు గుర్తించారు. ఇక గిడ్డంగుల నిర్మాణం కోసం నాబార్డు నుంచి అప్పులు తీసుకోగా, అందులో దాదాపు వంద కోట్లు గోల్మాల్జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.
టూరిజంలో 250 కోట్లు గోల్ మాల్..
టూరిజం కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం జరిగినట్టు గుర్తించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో దాదాపు రూ.60 కోట్లు దేనికి ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదు. ఇటీవల టారిజం కార్పొరేషన్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగింది. అందులో కీలకమైన ఫైళ్లు మాయమైనట్టు తెలిసింది. పర్యాటక ప్రదేశాల్లో కార్పొరేషన్ కింద నడవాల్సిన హరిత హోటల్స్‌ను కాదని, పూర్తిస్థాయిలో ప్రైవేటుకు కట్టబెట్టడంలోనూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్పొరేషన్ లో దాదాపు రూ.250 కోట్ల మేర నిధుల గోల్మాల్జరిగినట్టు తెలిసింది. ఇక విజయ డెయిరీలో మిల్క్ ప్రొక్యూర్మెంట్, సేల్స్‌లో అక్రమాలు జరిగాయి. రూ.150 కోట్ల మెగా డెయిరీ నిర్మాణం, ఆదిలాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన డెయిరీల నిర్మాణల్లోనూ అవినీతి జరిగినట్టు తేల్చారు.
బీఆర్ఎస్ నేతలకు అగ్గువకే భూములు..
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ భూములను అగ్గువకే బీఆర్ఎస్ముఖ్యులకు అప్పగించినట్టు గుర్తించారు. టీఎస్ఐఐసీలోనూ భూముల అమ్మకాలు, కేటాయింపుల్లో ఎవరెవరికి లబ్ధి జరిగిందనే దానిపై సర్కార్దృష్టిసారించింది. ఎవరెవరికి? ఎక్కడెక్కడ భూములు కట్టబెట్టారనే దానిపై సమగ్ర రిపోర్టు తెప్పించుకుంటున్నది. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న బడా కంపెనీలకు ఏ ధరకు భూములు విక్రయించారు? అందులో ఏమైనా మతలబు జరిగిందా? అనే దానిపై రిపోర్ట్అడిగింది.
ఇక పోలీస్హౌసింగ్కార్పొరేషన్ను ప్రైవేట్ సంస్థగా మార్చేందుకు గత సర్కార్పావులు కదిపింది. ఈ కార్పొరేషన్ప్రభుత్వ గ్యారంటీతో రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్స్టేషన్ల నిర్మాణంతో పాటు, ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ ఆఫీస్‌లు, ఆఫీసర్ల బిల్డింగులు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేపడుతుంది. వీటిలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వివరాలు తీసుకుంటున్నది.
ఫిషరీస్ ఫెడరేషన్ లోనూ...
ఫిషరీష్ఫెడరేషన్, షీప్ ఫెడరేషన్ కింద అప్పులు తీసుకుని అమలు చేసిన వివిధ స్కీముల్లోనూ గోల్మాల్జరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ స్కీమ్‌లో ఏసీబీ అరెస్ట్‌లు మొదలుపెట్టింది. ఫిషరీస్లోనూ వెయ్యి కోట్లతో చేపట్టిన వివిధ పథకాలు, పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఏయే కంపెనీలకు ఏ మేరకు టెండర్లు ఇచ్చారనే దానిపై ప్రభుత్వం వివరాలు తీసుకుంటున్నది.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలోనూ సీడ్ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ఏం జరిగిందనే దానిపై ఇంటర్నల్‌గా ప్రభుత్వం సమాచారం తీసుకుంటున్నది. స్పోర్ట్స్ అథారిటీలో వివిధ రకాల ఆటలకు సంబంధించి ఎన్నికలకు ముందు కిట్లు కొనుగోలు చేశారు. ఇందుకు దాదాపు రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, హాకీ, ఫుట్ బాల్, బాస్కెట్‌బాల్ తదితర ఆటల కిట్స్, సీఎం కప్ నిర్వహణలో నిధుల గోల్మాల్ జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.