కెనడా ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన “ఇంటర్నేషనల్ టాలెంట్ ఆకర్షణ వ్యూహం” ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై-స్కిల్ ప్రొఫెషనల్స్‌కు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో H-1B వీసాలకు కొంత కాలం కిందట రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా భారత టెక్ నిపుణులకు కెనడా చర్యలు కొత్త ఊరటగా భావిస్తున్నారు.
2025 ఫెడరల్ బడ్జెట్‌లో భాగంగా ప్రకటించిన కొత్త వీసా రూల్స్ అమెరికాలో వీసా పరిమితుల వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారికి కెనడాలో వేగవంతమైన స్థిర నివాస అవకాశాలను అందిస్తుంది. అమెరికాలో చాలా మంది నైపుణ్య వ్యక్తులు వీసా పొందడం కష్టమవుతుందని, ఇది కెనడాకు మంచి అవకాశమని ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చెప్పారు. దీనిపై త్వరలోనే ఒక ప్రణాళికలను వివరంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే కెనడా ప్రభుత్వం రూ.10వేల 370 కోట్ల పెట్టుబడితో వెయ్యికి పైగా అంతర్జాతీయ పరిశోధకులను నియమించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రీసెర్చ్, హెల్త్ సర్వీసెస్, న్యూ టెక్ రంగాల్లో వీరిని తీసుకోవాలని చూస్తోంది.
కెనడా ప్రభుత్వ పెట్టుబడుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
1. రానున్న 13 ఏళ్లలో ఒక బిలియన్ కెనడిన్ డాలర్ల కెనడా నేషనల్ రీసెర్చ్ ఫండింగ్ కౌన్సిల్స్ (NSERC, SSHRC, CIHR) కోసం కొత్త ప్రోగ్రామ్ ఏర్పాటు.
2. 7 ఏళ్లలో C$400 మిలియన్ – అడ్వాన్స్‌డ్ ప్రయోగశాల మౌలిక సదుపాయాల కోసం కెనడా ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ నిధుల కేటాయింపు.
3. ఏళ్లలో C$133.6 మిలియన్ – అంతర్జాతీయ పీహెచ్‌డీ విద్యార్థులు, పోస్ట్-డాక్టోరల్ ఫెలోలకు కెనడాకు మారడానికి సహాయం.
4. 12 ఏళ్లలో C$120 మిలియన్ – విశ్వవిద్యాలయాలు విదేశీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకునేందుకు సపోర్ట్.
5. ఏళ్లలో C$97 మిలియన్ – Foreign Credential Recognition Action Fund ద్వారా విదేశీ డిగ్రీల గుర్తింపును వేగవంతం చేయడం, ముఖ్యంగా హెల్త్ అండ్ కన్‌స్ట్రక్షన్ రంగాల్లో.
ఈ చర్యలు కేవలం కెనడాలోని కార్మిక లోటును తీర్చడం మాత్రమే కాదని.. అమెరికా వలస విధాన రూల్స్ కఠినతతో ఏర్పడిన పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడమని తెలుస్తోంది. భారతీయ టెక్ ఉద్యోగులు.. ముఖ్యంగా అమెరికాలో వీసా అనిశ్చితి మధ్య ఉన్నవారికి అవకాశాలు అందించి ప్రయోజనం పొందటంగా తెలుస్తోంది.
