నయీంనగర్‍  పెద్దమోరీకి మోక్షం .. వరదనీరు సాఫీగా పోయేలా చర్యలు 

నయీంనగర్‍  పెద్దమోరీకి మోక్షం .. వరదనీరు సాఫీగా పోయేలా చర్యలు 
  • రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‍ సిగ్నల్‍
  • ఈనెల 5న ప్రస్తుత బ్రిడ్జిని కూల్చనున్న అధికారులు
  • రెడ్డి చికెన్‍ సెంటర్‍ నుంచి రంగ్‍ బార్‍ మధ్య రాకపోకలు బంద్‍
  • హనుమకొండ- కరీంనగర్‍ ప్రధాన రోడ్డులో మూడు నెలలు పాటు పనులు 

వరంగల్‍, వెలుగు: ముంపు కాలనీలకు మోక్షం కలుగనున్నది. వరంగల్‍ సిటీలో వరదలతో మునిగే కాలనీల్లో ముందుగా గుర్తొచ్చేది హనుమకొండ _కరీంనగర్‍ ప్రధాన రోడ్డులో నయీంనగర్‍ పెద్దమోరీ (బ్రిడ్జి). ఈ మోరీ పనులకు ఇప్పుడు మోక్షం లభించనున్నది. నయీంనగర్‍ నాలా ఆక్రమణ, బ్రిడ్జి సరిగ్గా లేకపోవడడంతో ఐదేండ్ల నుంచి పట్టణంలోని వందలాది కాలనీలు మునిగిపోతున్నాయని అప్పటి మున్సిపల్‍ మినిస్టర్‍ కేటీఆర్‍ మొదలు జిల్లా మంత్రులు చెప్పారు.

ఐదేండ్లుగా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యారు తప్పితే పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.8 కోట్ల 50 లక్షలతో ఎత్తుగా కొత్త బ్రిడ్జి కట్టేందుకు గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చింది. మూడు నెలల్లో వానకాలం రానున్న నేపథ్యంలో గడువుకు ముందే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి చొరవతో ప్రభుత్వం ముందుకొచ్చింది. పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ నెల 5న ప్రస్తుతం ఉన్న నయీంనగర్‍ బ్రిడ్జిని పూర్తిగా కూల్చివేయనున్నారు.

రాకపోకలు బంద్‍

నయీంనగర్ బ్రిడ్జి పనులు మొదలైతే గురువారం నుంచి హనుమకొండ నుంచి కరీంగనర్‍, నిజామాబాద్‍, ఆదిలాబాద్‍ వంటి ఇతర జిల్లాలకు వెళ్లే ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోనున్నాయి. గతంలో కేయూ వంద ఫీట్ల రోడ్‍లో డక్ట్‍ పనులు చేసినప్పుడు మెయిన్‍ రోడ్డును తవ్వినట్లుగా నయీంనగర్‍ వద్ద పనులు మొదలవుతాయి. అనుకున్న గడువు ప్రకారం మూడు నెలలు ప్రయాణికులు ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.

కాగా, హనుమకొండ పబ్లిక్‍ గార్డెన్‍ నుంచి కరీంనగర్‍ వెళ్లే దారిలో కిషన్‍పుర రెడ్డి చికెన్‍ సెంటర్‍ వరకే ప్రయాణానికి అనువుగా ఉంటుంది. కేయూసీ నుంచి వచ్చే క్రమంలో రంగ్‍ బార్‍ వరకు అవకాశం ఉంటుంది. మొత్తంగా రంగ్‍ బార్‍ నుంచి రెడ్డి చికెన్‍ సెంటర్‍ మధ్య బ్రిడ్జి పనులు చేపట్టనున్నారు. బ్రిడ్జి ప్రస్తుతం ఉన్నదాని కంటే మరో ఫీటు ఎత్తు రానున్నది.

బ్రిడ్జి కింద దాదాపు 30 కాలనీ నీరు సాఫీగా వెళ్లేలా వెడల్పు కడాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికింద తాగునీటి పైపులు ఉన్న నేపథ్యంలో వాటిని మార్చాల్సి ఉంది. ఈ క్రమంలో కరీంనగర్‍ నుంచి గ్రేటర్ సిటీకి వచ్చే పెద్ద వాహనాలు కేయూ_పెద్దమ్మగడ్డ మీదుగా, బైక్‍ వంటి వాహనాలు రంగ్‍ బార్‍ మీదుగా పోలీస్‍ హెడ్‍క్వార్టర్‍ వద్దకు చేరేలా ట్రాఫిక్‍ పోలీసులు రూట్‍ మ్యాప్‍ ప్లాన్‍ చేశారు.

నాలాలపై 90 శాతం ఆక్రమణల తొలగింపు..  

వరద నీరు సాఫీగా పోవడానికి ఏండ్ల తరబడి అడ్డుగా ఉన్న నయీంనగర్‍ నుంచి హనుమాన్‍ నగర్‍ బ్రిడ్జి నాలాపై ఆక్రమణల తొలగింపు 90 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నాలాలపై ఆక్రమణ తొలగింపు 25 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల ఎత్తులో చేపట్టే నాలాల పనులు, ఇరువైపులా రిటర్నింగ్‍ వాల్‍ నిర్మాణానికి ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేశారు.

ఎటువంటి రాజకీయ జోక్యం లేకపోవడంతో అప్పటినుంచి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా పదేండ్లలో చేయలేని పనిని రాబోయే మూడు నెలల్లో ఒకవైపు నయీంనగర్‍ బ్రిడ్జి నిర్మాణం, మరోవైపు నాలాల వెడల్పు చేయడం ద్వారా వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.