దుబారా ఖర్చులకు దూరం.. ఆర్థిక వ్యవస్థను సెట్​ చేద్దాం

దుబారా ఖర్చులకు దూరం.. ఆర్థిక వ్యవస్థను సెట్​ చేద్దాం

ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. వాళ్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురాం రాజన్​తో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్బీఐ ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖ మీద పట్టున్న రిటైర్డ్​ ఐఏఎస్​లతోనూ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇక గతంలో ప్రతిపాదించిన బడ్జెట్​లన్నీ గందరగోళంగా ఉన్నాయని.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను వాస్తవికంగా రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఆదాయమెంత? ఉద్యోగుల జీతభత్యాలు, హామీల అమలు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది.

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేయడంతో నెలవారీ కిస్తీలు, వడ్డీల చెల్లింపులతో కొత్త సర్కార్ పై భారం పెరిగింది. ఖజానాలో అంతంత మాత్రమే నిధులు ఉండడంతో ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో నిధులు సర్దుబాటు చేసుకోవడంతో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా దుబారా ఖర్చులను తగ్గించడంతో పాటు రెగ్యులర్ గా తీసుకునే అప్పుల విషయంలో ఒక క్రమపద్ధతి పాటించాలని నిర్ణయం తీసుకున్నది. 

ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల నుంచే లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకోవాలని అనుకుంటున్నది. మరోవైపు భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూనే, ఎక్కువ భారం లేకుండా కొత్త పనులు మొదలుపెట్టేందుకూ ప్లాన్ చేస్తున్నది. ఇంకోవైపు వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024–-25 బడ్జెట్​లో హంగులు ఆర్భాటాలు, గొప్పలకు పోకుండా.. ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యమైన పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని భావిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నది. అప్పులు, దుబారా ఖర్చులు తగ్గించడంతో పాటు నిధుల సమీకరణపైనా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్​ పెట్టింది. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సమకూరే రాబడిని పెంచుకునే పనిలో పడింది. 

రిజర్వ్​బ్యాంక్ నుంచి స్టేట్​డెవలప్​మెంట్ లోన్ల కింద ప్రతినెలా నిర్దేశించుకున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంటున్నది. దీనికి యావరేజ్​గా 7.5 నుంచి 8 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితికి మించి అడ్వాన్స్ ల రూపంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటూ వచ్చింది. మరోవైపు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రైవేట్​ బ్యాంకుల నుంచి 11 శాతానికి మించి వడ్డీకి లోన్లు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పులు మినహా.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకునే అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకుల నుంచే తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కోరింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఏసియన్​డెవలప్ మెంట్ బ్యాంక్​(ఏడీబీ) నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవాలని భావిస్తున్నది. వీటిల్లో అప్పులు తీసుకుంటే కేవలం 3 నుంచి 4 శాతంలోపే వడ్డీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తక్కువ మొత్తం వడ్డీకి అప్పులు తీసుకుంటే భవిష్యత్తులో కిస్తీలు, వడ్డీ చెల్లింపులకు పెద్దగా భారం పడదని అంటున్నారు. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ నుంచి రావాల్సిన అప్పులన్నింటినీ పోయిన నవంబర్ నెలలోనే (రూ.39 వేల కోట్లు) గత బీఆర్ఎస్​ప్రభుత్వం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ సర్కార్​కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు నెలల కోసం తక్కువ వడ్డీకి కనీసం రూ.10 వేల కోట్ల నుంచి12 వేల కోట్ల వరకు సమకూర్చుకోవడంపై కొత్త ప్రభుత్వం దృష్టిసారించింది. 

దుబారా ఖర్చులకు దూరం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే ముందుగా దుబారా ఖర్చులను పూర్తిగా తగ్గించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. కొత్తగా వాహనాలు కొనుగోళ్లు, ఇతర హంగులు ఆర్భాటలకు దూరంగా ఉంటున్నది. కొత్తగా చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టులను కూడా తక్కువ ఖర్చుతో ముందుకు తీసుకెళ్తున్నది. ఇప్పటికే మెట్రో రైల్​రూట్​మార్చింది. దీంతో ఎక్కువ మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరడంతో పాటు ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. ఇక ప్రగతి భవన్​ను ప్రజా భవన్​గా మార్చిన ప్రభుత్వం.. అక్కడ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు అధికారిక నివాసాలు కేటాయించింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎంసీహెచ్​ఆర్డీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడ కొత్త బిల్డింగ్ కడితే, వృథా ఖర్చు అవుతుందని భావించి తాత్కాలికంగానే క్యాంప్ ఆఫీస్ ను సిద్ధం చేయిస్తున్నారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు కూడా తగ్గించాలని, తప్పనిసరైతేనే ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్లను వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే, కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నిర్ణయించింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనివి రూ.42 వేల కోట్లు పెండింగ్​బిల్లులు ఉండగా.. వాటిలో ముందుగా చిన్న చిన్న బిల్లులను క్లియర్​చేస్తున్నది. 

ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు.. 

ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. వాళ్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్​రఘురాం రాజన్​తో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్బీఐ ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక వ్యవస్థ మీద పట్టున్న రిటైర్డ్​ఐఏఎస్​లతోనూ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇక గతంలో ప్రతిపాదించిన బడ్జెట్​లన్నీ గందరగోళంగా ఉన్నాయని.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను వాస్తవికంగా రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఆదాయమెంత? ఉద్యోగుల జీతభత్యాలు, హామీల అమలు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది.