
- మహిళలకు వడ్డీ లేని, బ్యాంక్ లింకేజీ లోన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- వారు ఆర్థికంగా ఎదిగితే కుటుంబమంతా బాగుపడ్తది
- రూరల్‌లో రోడ్లు, తాగునీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్డెవలప్ చేస్తున్నమని వెల్లడి
- మెదక్, నర్సాపూర్‌లో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ
మెదక్/నర్సాపూర్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిర మహిళా శక్తి సంబరాలలో భాగంగా గురువారం మెదక్ కలెక్టరేట్ లో, నర్సాపూర్ లో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ లోన్లు, వడ్డీ లేని రుణాలు, బీమా పరిహారం చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైనప్పుడు రూ.60 వేల కోట్లు ఉన్న అప్పు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉన్నపటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంచామన్నారు.
ఎస్‌హెచ్ జీ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయాలి
సునీతా విలియమ్స్, మలావత్ పూర్ణను మహిళలు స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులైన మహిళలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో బెల్ట్ షాప్ ల దందా బంద్ చేయించేందుకు మంత్రి, కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకోవాలని ఎంపీ కోరారు.
పెరిగిన కొత్త రేషన్ కార్డులకు అనుగుణంగా కొత్త రేషన్ షాప్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ మహిళలు డ్రైవింగ్ నేర్చుకునేందుకు మెదక్ నియోజకవర్గానికి ఒక కారు డొనేట్ చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.35 కోట్లు, వడ్డీ లేని రుణాలు రూ.4 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్డీవో శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ స్ఫూర్తితో
ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నదన్నారు. అప్పుల భారం ఉన్నా ఆర్థిక వనరులు సమకూర్చుకుని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే కుటుంబం బాగుపడుతుందని అందుకనే బ్యాంక్ లింకేజీ ద్వారా లోన్ లు మంజూరు చేయడంతో పాటు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు.
మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు క్యాంటీన్ లు, ఎలక్ట్రిక్ బస్ లు, పెట్రోల్ బంక్ లు మంజూరు చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గ్రామాల్లో తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి, తదితర మౌలిక వసతులు కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందని, రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావును కోరారు.