
- ఇప్పటికే అందుబాటులో 66 పార్కులు
- కాలుష్యాన్ని నివారించి, ప్రజలకు ఆహ్లాదం కల్పించేలా కార్యాచరణ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హెచ్ ఎండీఏ పరిధిలో కొత్తగా మరో 19 పార్కులను డెవలప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. పచ్చదనం ఉట్టిపడేలా, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా వాటిని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. కాలనీలు, బస్తీల్లోని ప్రజలు ఉదయం వాకింగ్‌కు వెళ్లాలన్నా, పిల్లలతో వెళ్లి కొంత సమయం గడపాలన్నా శివారు ప్రాంతాల్లో పెద్దగా పార్కులు లేవు.
ఆ లోటును తీర్చేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు ముందడుగు వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కాలనీలు పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగా పార్కులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పలుచోట్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పార్కులను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, ట్యాంక్‌బండ్, గండిపేట, సాగర్ పార్క్, లేక్ వ్యూ పార్క్, హెర్బల్ గార్డెన్, శాతంరాయి, మేడిపల్లి ట్రీ పార్క్ వంటి 66 పార్కులు అందుబాటులో ఉన్నాయి.
ఏడాదికల్లా అందుబాటులోకి..
మియాపూర్ లో మయూరి రాక్ గార్డెన్, బీఎన్ రెడ్డి నగర్‌లోని హరిహరపురం, హయత్ నగర్ లోని జైహింద్ కాలనీ, ఓఆర్ ఆర్ పరిధిలో శామీర్ పేట్ రాక్ గార్డెన్, అమీర్ పేటలోని పంచతంత్ర కాలనీ, జవహర్ నగర్ లోని దమ్మాయిగూడ కాలనీ పార్క్, బాలాపూర్‌లో శివసాయి నగర్ కాలనీ పార్క్, అమీర్‌పేట లింగమయ్య కాలనీ పార్క్, కొడంగల్‌లో పట్టణ ప్రగతివనం, లహోటి కాలనీ పార్క్, వనస్థలిపురంలో వైదేహినగర్ కాలనీ పార్క్ అభివృద్ధి పనులను ఏడాదిగా చేస్తున్నారు.
కూకట్పల్లి 9వ ఫేజ్, ఫీర్జాదిగూడలోని ధరణి కాలనీ, బడంగ్‌పేటలోని జనప్రియ కాలనీ పార్కుల పనులు 50 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది కల్లా 19 పార్కుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. మనమహోత్సవం లో భాగంగా ఓఆర్ ఆర్, ట్రిపుల్ ఆర్, జాతీయ రహదారుల వెంట 4.5 కోట్ల మొక్కలను నాటేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు సిద్ధం అవుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వనమహోత్సవాలను నిర్వహిస్తూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు.
నగరం చుట్టూ అర్బన్ ఫారెస్ట్ పార్కులు..
నగరం చుట్టూ ఉన్న అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లను కూడా అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో 189 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లు ఉండగా ఇప్పటి వరకు 45 బ్లాక్ లను పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని, వీటిలో 17 పార్కులు పూర్తయినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పచ్చదనం విస్తరించేందుకు మరికొన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకూ అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తే విహార కేంద్రాలుగా కూడా అవి అందుబాటులోకి వస్తాయని ఆఫీసర్లు అంటున్నారు. ఫ్యామిలీతో అక్కడికి వెళ్లి స్టే చేసేలా అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.