నిజాం షుగర్స్​పై కదలిక .. చక్కెర ఫ్యాక్టరీల రీఓపెన్ !

నిజాం షుగర్స్​పై కదలిక  ..  చక్కెర ఫ్యాక్టరీల రీఓపెన్ !
  • విధివిధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీ
  • రెండు, మూడురోజుల్లో కార్యాచరణ షురూ

జగిత్యాల, వెలుగు: మూతపడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విధివిధానాల రూపకల్పన కోసం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు నేతృత్వంలో 10 మందితో ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి కో చైర్మన్​గా దామోదర రాజనర్సింహ వ్యవహరించనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కమిటీ మూడు జిల్లాల్లో ఉన్న షుగర్​ఫ్యాక్టరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ ను రీఓపెన్​చేయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు కార్యాచరణ ప్రారంభించడంపై ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులు, నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


నిజాం షుగర్స్ రీ ఓపెన్ కోసం వేసిన కమిటీకి చైర్మన్ గా ఇండస్ట్రీస్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, కో చైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఫైనాన్స్ డిపార్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండ్రస్ట్రీ, కామర్స్ డిపార్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆగ్రికల్చర్ డిపార్మెంట్ సెక్రటరీ, నిజాం షుగర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మెనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఉంటారు. కమిటీకి ప్రభుత్వం రెండు నెలల గడువు విధించింది. కమిటీ ఫీల్డ్​విజిట్​చేసి, వివిధ వర్గాలతో చర్చించి సర్కారుకు రిపోర్ట్ అందించనుంది. ఈ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తే 1500 మందికి ప్రత్యక్షంగా, ఆరు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దాదాపు 10 లక్షల టన్నుల కు పైగా కెపాసిటీ ఉన్న ఈ ఫ్యాక్టరీల ద్వారా కొత్తగా వేలాది ఎకరాల్లో చెరుకు సాగయ్యే అవకాశముంది.

తెలంగాణ వచ్చాక మూతపడ్డయ్..

1938లో నిజామాబాద్ జిల్లా బోధన్,1981లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్,1988లో మెదక్ జిల్లా మంబోజిపల్లిలో నిజాం షుగర్ ఫ్యాకర్టీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వరంగంలో 2002 వరకు బాగానే నడిచాయి. కానీ ఉమ్మడి ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో నిజాం షుగర్స్​ను ప్రైవేటుపరం చేసింది. జాయింట్ వెంచర్​గా (ప్రభుత్వానికి 49శాతం, ప్రైవేట్​కు 51శాతం కింద) డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి మూడు ఫ్యాక్టరీలను అప్పగించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభా సంఘం ఫీల్డ్ విజిట్ చేసి ఫ్యాక్టరీల స్థితిగతులు పరిశీలించింది. చెరుకు రైతులు, కార్మికులతో మాట్లాడి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ అప్పటి ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది అమలుకు నోచలేదు. 

2014 అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రారంభిస్తామని నాటి కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించి పదేండ్ల పాటు అధికారంలో ఉండి కూడా నిజాం షుగర్స్ రీ ఓపెన్​పట్టించుకోలేదు. 2015 డిసెంబర్​లో ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారికంగా లే ఆఫ్​ ప్రకటించడంతో కార్మికులు రోడ్డునపడ్డారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రూ.250 కోట్లకు పైగా విలువైన మిషనరీ తుప్పు పట్టింది. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంకు అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఈ క్రమంలో ఏడాది మార్చిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బస్సుయాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్​కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్లే ఆ దిశగా కమిటీ వేశారు.

కమిటీల పేరుతోకాలయాపన చేయద్దు

మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్​ కోసం కమిటీ వేస్తున్నట్లు సీఎం ప్రకటించడం సంతోషం. ఫ్యాక్టరీల రీఓపెన్ కోసం ఎనిమిదేండ్లుగా చెరుకు రైతులం పోరాడుతున్నాం. కనీసం ఈ ప్రభుత్వమైనా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఫ్యాక్టరీలు తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలి.  - 
నారాయణరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జగిత్యాల

ఇచ్చిన మాటకు కట్టుబడి కమిటీ వేశారు

 బీఆర్ఎస్​ హయంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది. రేవంత్ రెడ్డి  బస్సు యాత్ర లో భాగంగా ఫ్యాక్టరీని సందర్శించారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం ఫ్యాక్టరీల రీఓపెన్ ​కోసం కమిటీ వేశారు. 
 - వాకిటి సత్యం రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్

ఉద్యమంలో చెరుకు రైతులది కీలకపాత్ర

ఈ ప్రాంతంలో చెరుకు ప్రధాన పంట. ఉమ్మడి ఏపీలో ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేట్ పరం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు రైతులు కీలక పాత్ర పోషించారు. ఫ్యాక్టరీ తెరిపిస్తానని 2014 ఎన్నికల్లో కేసీఆర్, కవిత హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పడి బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. షుగర్​ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 
- జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ