కడెంపై ఫోకస్..ప్రాజెక్టు విద్యుద్దీకరణకు 3.81 కోట్లు విడుదల

కడెంపై ఫోకస్..ప్రాజెక్టు విద్యుద్దీకరణకు 3.81 కోట్లు విడుదల
  •     రిపేర్లకు ఇప్పటికే రూ.5 కోట్లు రిలీజ్​ చేసిన కాంగ్రెస్​ సర్కారు
  •     మూడు గేట్లకు ఓ కంట్రోల్ ప్యానెల్ ఏర్పాటు 
  •     వరద అంచనాకు సెన్సర్లు
  •     11 కేవీ లైన్ అనుమతులపై సందేహాలు

నిర్మల్, వెలుగు : గత ప్రభుత్వాలు కడెం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేయగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కడెం ప్రాజెక్టును ఆధునికీకరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు రిపేర్లు, ఇతర పనుల కోసం వరుసగా నిధులు విడుదల చేస్తుండడం పట్ల ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రి సీతక్క కడెం ప్రాజెక్టును సందర్శించి రిపేర్ల కోసం నిధులు మంజూరు చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లోనే రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. 

గేట్లను ఎత్తడం, దించడంలో సమస్య 

ఇప్పటికే ప్రాజెక్టు గేట్ల నాణ్యత దెబ్బతినగా ప్రతి ఏటా వరద సమయంలో ఆ గేట్లను ఎత్తడం, కిందకు దింపడం సమస్యగా మారింది. మరమ్మతులు కొనసాగుతున్నప్పటికీ వరద సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో గేట్లను పైకి ఎత్తడం, కిందకు దింపడం సాధ్యం కావడం లేదు. ప్రాజెక్టు వరద కెపాసిటీకి అనుగుణంగా గేట్లు పనిచేయకపోతుండడంతో  ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక్కడ 100 కిలోవాట్ల కెపాసిటీ గల జనరేటర్​ ఉంది. పవర్​సప్లై నిలిచిపోతే జనరేటర్​ ద్వారా గేట్లను ఎత్తడం సాధ్యం కావడంలేదు.

160 కిలో వాట్ల సామర్థ్యం గల జనరేటర్​ను, 11 కేవీ విద్యుత్ లైన్​ 500 కిలోవాట్ల కెపాసిటీ గల ప్రత్యేక ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు అధికారులు చాలా రోజుల క్రితమే ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఇందుకు అవసరమయ్యే నిధులను అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేయకపోవడంతో గేట్ల సమస్య ప్రాజెక్టు మనుగడకే ప్రమాదంగా మారింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ​ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సీరియస్​గా దృష్టిపెట్టింది. ప్రాజెక్టు విద్యుద్దీకరణ పనుల కోసం రూ.3 కోట్ల 81 లక్షలు విడుదల చేస్తూ మూడ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

నాలుగైదు రోజుల్లో టెండర్ ప్రక్రియ ముగించి పనులన్నింటినీ వేసవిలోపు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుదీకరణ పనులు పూర్తయితే హఠాత్తుగా వరద వచ్చినా గేట్లను ఆపరేట్​ చేయడం వీలవుతుంది. ప్రాజెక్టులోకి వచ్చే వరద ఉధృతిని ఎప్పటికప్పుడు రికార్డు చేసేందుకు సెన్సర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే మంజూరైన రూ.5 కోట్లతో గేట్ల రిపేర్లు కూడా జరుగుతున్నాయి.

వరద గేట్ల రూలర్స్, రూప్స్, రబ్బర్ సీల్స్​తోపాటు మోటర్ల రిపేర్లు, కౌంటర్ వెయిట్​ల ఏర్పాటు లాంటి పనులు చేపడుతున్నారు. ప్రాజెక్టు స్పిల్​వే రక్షణ, గోడల పనులు కూడా సాగుతున్నారు.

కీలకం కానున్నఅనుమతులు

కడెం ప్రాజెక్టు కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 11 కేవీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి కానున్నాయి. ప్రాజెక్టును నిర్మించినపుడు ఏండ్ల కింద ఉన్న విద్యుత్​ వ్యవస్థతోనే ఇప్పటివరకు నెట్టుకొస్తున్నారు. అయితే ఇక్కడ విద్యుత్ వైరింగ్​తో పాటు ప్యానెల్ బోర్డులు, లైటింగ్ వ్యవస్థ దెబ్బతిన్నాయి. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన 18 గేట్లను ఆపరేట్ చేసేందుకు దాదాపు 500 కిలోవాట్ కెపాసిటీ

గల ట్రాన్స్​ఫార్మర్ అవసరముంటుంది. ప్రస్తుతం ఇక్కడ 100 కిలోవాట్ల కెపాసిటీ ట్రాన్స్​ఫార్మర్ మాత్రమే ఉంది. జనరేటర్, ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతులు స్థానిక యంత్రాంగం పరిధిలోనే ఉంటున్నప్పటికీ 11 కేవీ లైన్ వ్యవహారం మాత్రం అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. దీంతో అనుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

సింక్రనైజింగ్ ప్యానళ్లతో గేట్ల ఆపరేషన్

ఈదురు గాలులు, భారీ వర్షాలు, వరద ఉధృతికి కరెంట్ సరఫరా నిలిచిపోయి గేట్లు ఎత్తడం, దించడంలో సమస్య ఏర్పడుతోంది. దీన్ని అధిగమించేందుకు జనరేటర్ ద్వారా గేట్లను ఆపరేట్​ చేసేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకు సింక్రనైజింగ్ ప్యానళ్లను ఏర్పాటు చేసి మొత్తం 18 గేట్లను ఆపరేట్ చేయనున్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ జనరేటర్ ద్వారా కరెంటు సరఫరా జరిగి గేట్లను పైకి ఎత్తడం, కిందికి దింపడం సులభమవుతుంది. అలాగే కడెం గ్రామానికి, ప్రాజెక్టుకు వేర్వేరుగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు.