
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రచారంలో దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రజనీకి ...రేవంత్ నియామక పత్రం అందజేశారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల ఫైలుపై.. తరువాత ఫైలుపై రజనీ నియామక పత్రంపై సంతకం చేసి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా అందజేశారు.
తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపునకు నిరుద్యోగ యువత కూడా ఒక ప్రధాన కారణం అని అందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న స్లోగన్ తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ..ప్రభుత్వంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయింది. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ .. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చింది. నేడు ( డిసెంబర్ 7) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ లో ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన గ్యారెంటీ (హామీ)ని అమలు చేశారు.
హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజిని పీజీ పూర్తి చేసింది. అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని ఈ ఏడాది అక్టోబర్ నెలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. రజనీ అవేదనను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే వస్తారని చెప్పిన రేవంత్.. అదే రోజున వారి సమక్షంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం ఇస్తుందని రజినీకి హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు అని రేవంత్ రాసి ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవాళ ( డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు ఉద్యోగం ఇచ్చారు.