ఇక ఆ స్కీమ్​ల అమలు పక్కాగా.. త్వరలోనే విధివిధానాలు

ఇక ఆ స్కీమ్​ల అమలు పక్కాగా..  త్వరలోనే విధివిధానాలు

హైదరాబాద్​, వెలుగు: గత ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని స్కీముల్లో అక్రమాలు జరగకుండా మార్పులు చేసి అమలు చేయాలని రాష్ట్ర సర్కార్​ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వానాకాలం మొదలు కావడంతో సమయానుకూలంగా చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా హరితహారం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, చేప పిల్లల పంపిణీ వంటి స్కీముల మార్గదర్శకాలు మార్చి సరికొత్తగా అమలు చేసేందుకు యాక్షన్​ ప్లాన్ ను రెడీ చేస్తున్నారు. 

ప్రచారం, ఆర్భాటం కోసం కాకుండా స్కీములు దేనికోసం ఉద్దేశించి మొదలుపెట్టారో ఆ లక్ష్యం నెరవేరేలా ఇంప్లిమెంట్​ కావాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. నిధుల ఖర్చు విషయంలోనూ దుబరాగా ఉండొద్దని.. ప్రతిదీ అకౌంటబులిటీ ఉండేలా చూడాలని ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆయా స్కీములపై త్వరలోనే సీఎం రేవంత్​ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ చేయనున్నారు. కొన్ని స్కీములకు పేర్లు కూడా మార్చనున్నట్లు తెలుస్తున్నది. చేప పిల్లల పంపిణీలోనూ గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో ఈ స్కీంలోనూ మార్పులు చేయనున్నారు. చేప పిల్లలను నీటి వనరుల్లో వదిలే ముందు పక్కాగా లెక్క ఉండేలా చూడనున్నారు. నాణ్యమైన చేప పిల్లల పంపిణీ చేసేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 

ఒక మొక్క నాటి రెండింతలు రికార్డు చేసిన్రు

2015–16 నుంచి తొమ్మిది విడతలుగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారం పేరు మార్చడంతో పాటు గతంలో జరిగిన అక్రమాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలకు రెండింతలు రికార్డుల్లో నమోదు చేయడం, ఆ తర్వాత ఆ మొక్కలు చనిపోయాయని పేర్కొంటూ మళ్లీ మొక్కలు నాటినట్లు చూపడం వంటివి జరిగాయని ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటినట్లు, రూ.11,747 కోట్ల ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

 వ్యయానికి తగ్గట్టు  ఫలితాలు రాకపోవడంతో హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. హరితహారం పేరును ‘ఇందిరమ్మ హరితవనం’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇష్టారీతిన కాకుండా మొక్కలను నాటేది ప్రతిది రికార్డులో ఉండేలా జియో ట్యాగింగ్ ను తప్పనిసరి చేయనున్నారు. ఎవరెవరైతే మొక్కలు నాటుతున్నారో.. ఆయా అధికారుల పరిధిలో మొక్కల ఎదుగుదలపైనా ప్రతి నెలకోసారి ఆన్​లైన్​ అప్​డేట్, ఫొటో పెట్టేలా  ప్లాన్ చేస్తున్నారు. వాటిపైనా కూడా మానిటరింగ్​ కమిటీలు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎక్కువగా వేప, చింత మొక్కలు నాటే అవకాశం ఉంది. 

పల్లెలకు మేలు చేసేలా ఫైనాన్స్​ కమిషన్​ ఫండ్స్​ 

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలోనూ మార్పులు చేయాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించింది. ఫైనాన్స్​ కమిషన్​ నిధులను నేరుగా గ్రామాల అభివృద్ధికి వినియోగించనుంది. సర్పంచులకు తిప్పలు లేకుండా ప్రత్యేక విధానంలో కమిషన్​ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం యాక్షన్​ ప్లాన్​ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఫైనాన్స్​ కమిషన్​ నిధులతో పాటు అంతే మొత్తంలో రాష్ట్ర నిధులు కలిపి ఇచ్చినట్లు ప్రకటించుకున్నది. కానీ, క్షేత్రస్థాయిలో ఫండ్స్​ రాక.. కనీసం గ్రామ పంచాయతీలు కరెంట్​ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లాయి. సర్పంచ్​లు అప్పులు చేసి కొన్ని పనులు చేయించినా వాటిని కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. పారిశుధ్య పనులకు కూడా పైసలు ఇవ్వలేదు. 

ఉపాధి హామీ నిధులతో డంపింగ్​ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు నిర్మించి వదలేసింది. కనీసం మెయింటెనెన్స్​ కూడా చేయలేదు.  15వ ఫైనాన్స్​ కమిషన్​ ద్వారా  రాష్ట్రంలోని గ్రామాలకు గత ఏడాది రూ. 1,415 కోట్ల నిధులు వచ్చాయి. వీటికి సమానంగా రాష్ట్ర సర్కారు నుంచి నిధులు ఇస్తామని చెప్పినా.. అందులో సగం కూడా ఇవ్వలేదు. ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లను గత ప్రభుత్వం దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్​ ఫైనాన్స్​ మేనేజ్మెంట్​ సిస్టమ్​ (పీఎఫ్‌ఎంఎస్‌)ను తెరపైకి తెచ్చింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాల పేర్లను మార్చి, కొత్తగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో డెవలప్​మెంట్​ కోసం మహిళా సంఘాలను వినియోగించుకోనుంది.