
- మహిళా సాధికారత దిశగా అడుగులు
- నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం
మహబూబాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీలేని రుణాలను విడుదల చేయడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా 18 ఏండ్లకు పైబడిన 61 ఏండ్లు దాటిన మహిళలను సైతం డ్వాక్రా సంఘాల్లో చేర్పించుకోవాలని, వారితో నూతన సంఘాలను ఏర్పాటు చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ర్ట సర్కారు ఏక కాలంలో నిధులు మంజూరు చేయడంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.
ప్రమాద బీమా సౌకర్యం పెంపు..
గతంలో డ్వాక్రా సంఘాలకు ప్రమాద బీమా కేవలం రూ.5 లక్షలు ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యురాలిగా ఉన్న మహిళ ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.10 లక్షల ప్రమాద బీమా అందనుంది. సంఘంలో సభ్యురాలిగా రుణం పొంది రూ.లక్ష వరకు లోన్ పొంది రూ.20 వేలు చెల్లించిన తర్వాత ఏదైనా కారణంతో మహిళ చనిపోతే మిగిలిన రూ.80 వేల లోన్ ప్రభుత్వమే చెల్లించనుంది. తద్వారా డ్వాక్రా సంఘాల మహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
కొత్త రుణాలు పొందే అవకాశం ఉంది..
డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాల కోసం వడ్డీ రాయితీ నిధులు బారీగా విడుదల చేసింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు వడ్డీలేని రుణాలు రెగ్యులర్‌గా రుణాలు చెల్లించే సంఘాలకే వర్తిస్తుంది. గతంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన డ్వాక్రా సంఘాల మహిళలు పెండింగ్ రుణాన్ని త్వరగా చెల్లించి, కొత్తగా గతంలో కంటే ఎక్కువగా రుణాలను బ్యాంకుల ద్వారా పొందవచ్చు. చిరు వ్యాపారాలు, వ్యవసాయ పెట్టుబడులకు, ఇతర కుటుంబాల అవసరాలకు వినియోగించుకుని ఆర్థిక స్వాలంబన దిశగా ముందుకు సాగాలి. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఆయా మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధుల మంజూరు చెక్‌లను అందించనున్నాం. కొత్త సభ్యులను చేర్పించడం ద్వారా నూతన డ్వాక్రా సంఘాల ప్రారంభం కోసం తగిన చర్యలను చేపడుతున్నాం. - మధుసూదన్‌రాజు, డీఆర్డీఏ పీడీ, మహబూబాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడ్డీ రాయితీ విడుదల
అసెంబ్లీ నిధులు నియోజకవర్గం రూ.లక్షలలో
నర్సంపేట 242.37
వర్ధన్నపేట 131.38
పరకాల 172.44
జనగామ 221.32
స్టేషన్‌ఘన్‌పూర్ 236.25
పాలకుర్తి 185.02
భూపాలపల్లి 191.72
డోర్నకల్ 172.36
మహబూబాబాద్ 152.40
ములుగు 193.53