యూపీఎస్​లో U అంటే మోదీ యూటర్న్ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

యూపీఎస్​లో U అంటే మోదీ యూటర్న్ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ఫైర్ అయింది. యూపీఎస్​లో యూ అంటే యూ టర్న్ మోదీ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదివారం కామెంట్ చేశారు. లోక్​సభ ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోదీ దురహంకారానికి ప్రజలు అడ్డుకట్ట వేశారని అన్నారు. దీంతో బీజేపీ సర్కారు తన కీలక నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభించిందన్నారు.

‘‘ప్రజల నిరసనలతో మోదీ సర్కారు.. లాంగ్ టైమ్ క్యాపిటల్ గెయిన్​కు సంబంధించి బడ్జెట్​లో తీసుకున్న నిర్ణయాలను, డ్రాఫ్ట్ బ్రాడ్​కాస్టింగ్ బిల్లును ఉపసంహరించుకుంది. లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రకటించి.. విమర్శలు రావడంతో వాపస్ తీసుకుంది. ఇప్పుడు యూపీఎస్ విషయంలోనూ కేంద్రం యూ టర్న్ తీసుకుంటోంది”అని ఖర్గే ట్వీట్ చేశారు. తాము మాత్రం జవాబుదారీతనాన్ని కొనసాగిస్తామని, నిరంకుశ బీజేపీ సర్కారు నుంచి 140 కోట్ల మంది ప్రజలను కాపాడుతామని ఆయన అన్నారు.

ఎస్టీ, ఎస్సీ, బీసీలపై దాడి: ఖేరా

యూపీఎస్ అమలు చేయడమంటే గిరిజనులు, దళితులు, బీసీలపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో, రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ కేటగిరీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలుంటే UPSCలో 37 సంవత్సరాలు ఉందని గుర్తుచేశారు. యూపీఎస్ కింద పూర్తి పెన్షన్ పొందాలంటే 25 సంవత్సరాలు సర్వీస్ చేసుండాలని, అటువంటి పరిస్థితుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని ఎలా పొందుతారని ఆయన ప్రశ్నించారు. పేదలకు అందుబాటులో ఉన్న గరిష్ట వయోపరిమితి సౌకర్యాన్ని రద్దు చేయాలనుకుంటున్నారా లేదా వాళ్లను పూర్తి పెన్షన్​కు దూరం చేయాలనుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఖేరా ప్రశ్నించారు.