హైదరాబాద్, వెలుగు : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. ఇందుకోసం కాంగ్రెస్ గిరిజన విభాగం నేతలు గ్రామ స్థాయిలో నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దీపాదాస్ మున్షీ హాజరై, మాట్లాడారు. గిరిజన నేతలకు ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గిరిజన కుటుంబానికి రాహుల్ గాంధీ యాత్ర ఉద్దేశాన్ని తెలిసేలా చేయాలన్నారు. కాగా, సమావేశంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలుపై తీర్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన గిరిజన నేతలను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులిచ్చేలా చొరవ తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. దాంతో పాటు కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ ఇంకో తీర్మానం చేశారు.
