ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకం

ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నిర్మల్/కోల్ బెల్ట్, వెలుగు: డీసీసీ ప్రెసిడెంట్ల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం శనివారం రాత్రి ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​గా కాంగ్రెస్ సీనియర్ లీడర్ పిన్నింటి రఘునాథ్​ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన రఘునాథ్ రెడ్డి 35 ఏళ్లుగా కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. 

జిల్లా నుంచి 29 మంది పదవి కోసం దరఖాస్తు చేసుకోగా పదవి ఆయనను వరించింది. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి పదవి రావడానికి కృషి చేసిన మంత్రి వివేక్ ​వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావుకు రఘునాథ్​ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాల్​కు నరేశ్ జాదవ్ 

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంట్ కో ఆర్డినేటర్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్​ను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 
ఓడిపోయారు.

ఆసిఫాబాద్​కు ఆత్రం సుగుణ

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణను అధిష్టానం నియమించింది. గతంలో ఆమె ఆదిలాబాద్ పార్లమెంట్​కు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఓడిపోయినా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షుడు గా కొనసాగిన విశ్వప్రసాద్ ఓసీ వర్గానికి చెందిన వారు కాగా ఆదివాసీ జిల్లాలో మొదటిసారి ఆదివాసీ గిరిజన మహిళకు డీసీసీ పీఠం దక్కడం విశేషం.

నిర్మల్​కు ఎమ్మెల్యే బొజ్జు పటేల్

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు శ్రీహరిరావుతో పాటు మరి కొంత మంది ఈ పదవి కోసం దరఖాస్తులు చేశారు. అయితే అధిష్టానం మాత్రం వీరందరినీ కాదని అనూహ్యంగా ఎమ్మెల్యే బొజ్జును ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.