వారంలోపే కొత్త పీసీసీ చీఫ్​! .. లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధత కోసం చర్యలు

వారంలోపే కొత్త పీసీసీ చీఫ్​! .. లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధత కోసం చర్యలు
  • వీలైనంత త్వరగా నియమించేందుకు హైకమాండ్ కసరత్తులు
  • సీఎం రెడ్డి.. డిప్యూటీ సీఎం ఎస్సీ.. పీసీసీ చీఫ్ బీసీకి?
  • పొన్నం, మహేశ్ కుమార్​గౌడ్ పేర్లు పరిశీలన
  • రేసులో మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ కొత్త చీఫ్​ను నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం ఢిల్లీ వేదికగా మంతనాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం లోపలే పీసీసీకి కొత్త చీఫ్​ను ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. సీఎంగా రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ నేతలు ఉన్న నేపథ్యంలో.. పార్టీ పగ్గాలను బీసీకి అప్పజెప్పాలని, తద్వారా సామాజిక సమతూకం పాటించినట్లు అవుతుందని హైకమాండ్​ యోచిస్తున్నట్టు సమాచారం.

బీసీ నేతల​పేర్ల పరిశీలన?

పీసీసీ చీఫ్ రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ముందున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్ఎస్​యూఐ స్టేట్ ప్రెసిడెంట్​గా రాష్ట్రంలో బలమైన ముద్ర వేసిన పొన్నం ప్రభాకర్​కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనలో హైకమాండ్​ పెద్దలున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్న ఆయనకు.. పార్టీ పగ్గాలివ్వడం ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అనుసరించిన పంథాలోనే వెళ్లాలన్న భావనలోనూ ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఉన్న మహేశ్​కుమార్ గౌడ్​ పేరునూ పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. వారిలో ఒకరికి పీసీసీ చీఫ్​ పదవి దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు మధు యాష్కీ, అంజన్ కుమార్ యాదవ్​ పేర్లూ కూడా వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తున్నది. దళిత సామాజికవర్గం నుంచి సంపత్ కుమార్ పేరునూ పరిశీలించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది.

వీక్​ సెగ్మెంట్లపై ఫోకస్​..

సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే బిజీబిజీగా గడిపేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా రివ్యూలు చేస్తున్నారు. లోక్​సభ ఎన్నికల సన్నద్ధతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముంటుంది. ఈ క్రమంలోనే అధికార బాధ్యతలు, పార్టీ బాధ్యతలను ఒకేసారి నడపడం కష్టమని భావిస్తున్న హైకమాండ్.. పీసీసీకి కొత్త చీఫ్​ను త్వరగా నియమించాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు కొన్ని సెగ్మెంట్లలో పార్టీ అత్యంత వీక్​గా ఉన్నట్టు తేలింది.

హైదరాబాద్​, సికింద్రాబాద్​ పార్లమెంట్ సెగ్మెంట్లలో పార్టీ కనీసం ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. ఆదిలాబాద్​, నిజామాబాద్ లోక్​సభ సెగ్మెంట్లలోనూ ఇతర పార్టీల నుంచి పోటీ అత్యంత తీవ్రంగా ఉన్నది. దాదాపు 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడో స్థానంతోనే పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా సెగ్మెంట్లలో పార్టీ బలహీనతలు, లోపాలను ముందే గుర్తించి సరిచేసుకోవడం ద్వారా లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని యోచిస్తున్నది. అందుకే వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్​ను మార్చాలని హైకమాండ్ భావిస్తున్నది.