జిల్లాలో ముగ్గురు నేతల నడుమ ఆధిపత్యపోరు 

జిల్లాలో ముగ్గురు నేతల నడుమ ఆధిపత్యపోరు 
  • క్యాడర్​కు అందుబాటులో ఉండని లీడర్లు
  • పార్టీ కార్యక్రమాలపై సమన్వయం కరువు
  • అగమ్యగోచరంగా కాంగ్రెస్‌ పరిస్థితి

నిజామాబాద్,  వెలుగు: ముగ్గురు కీలక నేతల ఆధిపత్య పోరు వల్ల జిల్లాలో కాంగ్రెస్ డీలా పడుతోంది.  మధుయాష్కీ, మహేశ్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి టీపీసీసీలో కీలక హోదాల్లో ఉన్నప్పటికీ స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీపై  క్రమ శిక్షణ ఉల్లంఘన చర్యలు చేపట్టాలని పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినప్పటి నుంచి వర్గపోరు తీవ్రమైంది. నేతలు ముగ్గురూ క్యాడర్​కు అందుబాటులోకి రాకపోవడం, ముగ్గురూ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే స్పష్టత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలు, ప్రజాసమస్యలపై పోరాటం విషయంలో మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఇందూరులో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

కొంతకాలంగా ఆధిపత్య పోరు

జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతల మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొమ్మ మహేశ్‌గౌడ్, టీపీసీసీ ట్రెజరర్‌‌గా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ముగ్గురూ కీలక పదవుల్లో ఉన్నారు. మొదట టీపీసీసీలో ఇద్దరు జిల్లా కాంగ్రెస్​ నేతలకు చోటు దక్కడంతో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. దీంతో పదవీ స్వీకారం అనంతరం మహేశ్‌గౌడ్, మధుయాష్కీల జిల్లా తొలి పర్యటన సభకు మాజీ మంత్రి దూరంగా ఉన్నారు. ​ మధుయాష్కీ బోధన్ అసెంబ్లీ కార్యకర్తల మీటింగ్‌కు హాజరుకాగా, సుదర్శన్‌రెడ్డి అటు వైపు రాలేదు. బోధన్ అసెంబ్లీ స్థానంలో మరో నేతను ప్రోత్సహిస్తున్నారని సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. ఇందుకు పోటీగా సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్​లో రేవంత్‌రెడ్డి సమక్షంలో బోధన్ అసెంబ్లీ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ సమావేశానికి మధుయాష్కీ, మహేశ్‌గౌడ్ హాజరుకాలేదు.

యూపీ ఎన్నికల టైంలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆఫీసర్లపై చేసిన వ్యాఖ్యలను మధుయాష్కీ  ఖండించారు. దీంతో జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సర్వసభ్య సమావేశంలో మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానం వెనుక సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌గౌడ్​ హస్తం ఉందని మధుయాష్కీ వర్గీయులు అప్పట్లో ఆరోపించారు. మరో వైపు హైదరాబాద్‌కే పరిమితమైన మధుయాష్కీ అరుదుగా తప్ప జిల్లాకు రావడం లేదు. దీంతో ఆయన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది. ఇది కూడా ఆ ఇద్దరి కుట్రేనని మధు వర్గీయుల ఆరోపణ.  

క్యాడర్‌‌కు అందుబాటులో ఉంటలే.. 

టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌‌గా ఉన్న మధుయాష్కీ  2004, 2009 లలో రెండు సార్లు  నిజామాబాద్​ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈసారి ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారనే టాక్​ నడుస్తోంది. సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని కొందరు, నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారని ఇంకొందరు చెబుతున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనపెడితే కొంత కాలంగా మధుయాష్కీ జిల్లాపై దృష్టి పెట్టడం లేదు. పర్యటనలు కూడా తగ్గించడంతో ఆయనకు నిజామాబాద్​నుంచి పోటీ చేసే ఆసక్తి లేదనే చర్చ జరుగుతోంది. దీంతో ఆయన అనుచరులు కూడా అయోమయంలో ఉన్నారు. 

ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న  మహేశ్‌గౌడ్ గాంధీ భవన్‌కే పరిమితమవుతున్నారు.1994లో డిచ్‌పల్లి నుంచి గెలిచిన మహేశ్‌​గౌడ్​2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో ఈయనకు ఇప్పటికీ క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. ఆర్మూర్‌‌లో నుంచి అంటూ ఓసారి, రూరల్ నుంచి అంటూ మరోసారి లీకులు ఇస్తుండడంతో క్యాడర్ అయోమయంలో పడ్డారు. ఆర్మూర్ నియోజకవర్గం ఇన్‌చార్జిని ఇప్పటి వరకు నియమించకపోవడంతో ఇక్కడ పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. 

ఇక బోధన్‌లో ఒకప్పటి హాట్రిక్​ ఎమ్మెల్యే అయిన సుదర్శన్‌రెడ్డి అడపాదడపా నియోజవర్గంలో పర్యటిస్తున్నా, ఆయన కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే పార్టీ గురించి పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు రావడం కష్టమవుతుండడంతో పార్టీ మారుతారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈయనకు సొంత నియోజకవర్గంలో ఇంటి పోరు మొదలైంది. మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి అల్లుడు కెప్టెన్ కరుణాకర్‌‌రెడ్డి బోధన్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతుండడంతో సుదర్శన్‌రెడ్డికి వర్గపోరు తప్పడం లేదు. ఇలా జిల్లా కాంగ్రెస్‌లో ముగ్గురు లీడర్లు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో కింది స్థాయి నేతలు కూడా తమ దారి తాము చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.