ఓబీసీలను కాంగ్రెస్ అవమానిస్తున్నది : ఎంపీ లక్ష్మణ్​

ఓబీసీలను కాంగ్రెస్ అవమానిస్తున్నది : ఎంపీ లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు :  ప్రధాని మోదీని కులం పేరుతో పదే పదే దూషిస్తూ.. ఓబీసీలను కాంగ్రెస్ అవమానిస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బతికున్న కాంగ్రెస్ నేతలను భారతరత్నతో గౌరవించిన ఆ పార్టీ.. అంబేద్కర్​కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలన్న మనసు మాత్రం రాలేదని విమర్శించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘ఐదుగురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నది. ఓబీసీ నేత కర్పూరీ ఠాకూర్​కు భారతరత్న ఇస్తే తట్టుకోలేకపోతున్నది. హిందువులను, దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకికవాదమా? అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్​లో చర్చిస్తే కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కింది. త్వరలో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది’’అని ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం హిందువుల కోసమే పని చేస్తుందన్న మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లను లక్ష్మణ్ ఖండించారు. 

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అణిచివేసింది. అంబేద్కర్ పేరు చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు దండుకుని మొసలి కన్నీరు కారుస్తున్నది’’అని ఆయన విమర్శించారు.