
న్యూఢిల్లీ: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (సీఎస్‌వో) సమిట్‌లో భాగంగా చైనా అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గాల్వాన్ లోయలో అమరులైన 20 మంది సైనికులను అవమానించడమే అవుతుందని విమర్శించింది. అమెరికా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. చైనా మాత్రం ఇండియాకు మద్దతుగా నిలబడటం లేదని మండిపడింది.
ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో పాకిస్తాన్‌కు చైనా ఓపెన్‌గా సపోర్ట్ చేసిందని కాంగ్రెస్ తెలిపింది. బార్డర్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌కు చైనా చేరవేసిందని పేర్కొన్నది. ఇండియాపై చైనా కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం జిన్‌పింగ్‌కు నవ్వుతూ షేక్ ఇవ్వడం కరెక్ట్ కాదని విమర్శించింది. ఇండియా ఇంటెలిజెన్స్ సమాచారం పాకిస్తాన్‌తో చైనా పంచుకుంటున్నదని ఆరోపించింది.
మోదీ చైనా పర్యటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. చైనా సపోర్ట్‌తోనే పాకిస్తాన్ రెచ్చిపోతున్నదన్న విషయం అందరికీ తెలుసని తెలిపారు. అయినప్పటికీ.. మోదీ చైనా పర్యటనకు వెళ్లారని విమర్శించారు. చైనాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిన్‌పింగ్‌ను నమ్మడానికి లేదని తెలిపారు.