కంగనపై దేశద్రోహం కేసు పెట్టాలె

కంగనపై దేశద్రోహం కేసు పెట్టాలె

స్వాతంత్ర్యం గురించి వివాదాస్పద కామెంట్లు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయాలని, ఇటీవల ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీస్కోవాలని వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కంగన కామెంట్లు దేశద్రోహం కిందకే వస్తాయని కాంగ్రెస్ మండిపడింది. ‘‘కంగనకు ఇచ్చిన పద్మశ్రీని వెంటనే వెనక్కి తీస్కోవాలి. ఇలాంటి అవార్డులు ఇచ్చే ముందు వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో అలాంటి వ్యక్తులు దేశాన్ని కించపరిచే కామెంట్లు చేయకుండా అడ్డుకోవచ్చు” అని కాంగ్రెస్ లీడర్ ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు. దీన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ట్యాగ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎంతోమందిని కంగన కించపరిచిందని ఫైర్ అయ్యారు. 1947లో మన దేశానికి వచ్చింది స్వాతంత్ర్యం కాదు భిక్ష అని.. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినంకనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని కంగన కామెంట్ చేసింది.
 
డ్రగ్ మత్తులో మాట్లాడింది: నవాబ్ మాలిక్ 
‘‘కంగన కామెంట్లను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచింది. కేంద్రం కంగనకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆమెను అరెస్టు చేయాలి” అని ఎన్సీపీ లీడర్, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. ఆమె డ్రగ్ మత్తులో ఈ కామెంట్లు చేసిందని ఆరోపించారు. ఈ కామెంట్లు చేసే ముందు కంగన ఎక్కువ మోతాదులో డ్రగ్ తీసుకున్నట్లు అనిపిస్తోందన్నారు. కంగనపై కచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్, శివసేన కూడా డిమాండ్ చేశాయి.