- 50 ఏండ్లకు పైగా రాజకీయ జీవితం
- లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రిగా సేవలు.. నేడు అంత్యక్రియలు
లాతూర్: కాంగ్రెస్ కురు వృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూశారు. శుక్రవారం మహారాష్ట్ర లాతూర్‌లోని తన ఇంట్లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శివరాజ్ పాటిల్‌కు కొడుకు, కోడలు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారు. ఆయన అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పాటిల్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాటిల్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా ప్రస్థానం..
శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న పుట్టారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టారు. 1966లో లాతూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1970 నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. ఆ తర్వాత 1980 నుంచి 1999 వరకు వరుసగా ఏడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రమంత్రిగా కీలకమైన శాఖలను చూశారు. 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు.
2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోగా, అదే ఏడాది రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో హోంమంత్రిగా పని చేశారు. అదే టైమ్‌లో 2006 మాలేగావ్ పేలుళ్లు, 2008 ఢిల్లీ వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడులు జరిగాయి. దీంతో దేశ భద్రతను పర్యవేక్షించడంలో శివరాజ్ పాటిల్ విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఓవైపు పేలుళ్లు జరిగి జనం చనిపోతే, ఆయన ఒకేరోజు మూడు డ్రెస్సులు మార్చారని మీడియాలో కథనాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా విమర్శలు తీవ్రమవడంతో 2008 నవంబర్ 30న రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా సేవలందించారు.

