ఆ మాటల్లో అధికార మదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది: రేవంత్
‘‘కేబినెట్ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఏకపాత్రాభియనం చూసిన. ఆయన మాటల్లో అడుగడుగునా అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్టు కనిపించాయి. 16 మంది కార్మికులు చనిపోతే కనీస మానవత్వం లేకుండా మాట్లాడారు. ఆదుకుంటామనిగానీ, ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ, సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కానీ కనిపించలేదు. కేసీఆర్.. తెలంగాణ సమాజం ఇక నిన్ను ఒక్క క్షణం కూడా భరించలేదు..” అని ఎంపీ రేవంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం రాత్రి సీఎం ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ అంశాలు రేవంత్ మాటల్లోనే..
ప్రైవేటుకు ఇచ్చేందుకే డ్రామా..
‘‘నేనింతే.. నేను నియంతను, నా ఇష్టారాజ్యంగా చేస్తాను. బతికితే బతకండి.. చస్తే చావండి అన్నట్టుగా కేసీఆర్ తీరు కనిపించింది. రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మొత్తం విన్న తర్వాత ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కంకణం కట్టుకున్నారు. దాని కోసం ఎన్ని ప్రాణాలైనా బలిపెట్టడానికి సిద్ధపడ్డారు.
సమస్యలపై అడిగితే తప్పా?
సమస్యలు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడి, పరిష్కారం కనుగొనాలి. కానీ కేసీఆర్ నియంతలా తన నిర్ణయమై ఫైనల్ అంటున్నారు. కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే కనికరం చూపలేని రాతి హృదయం కలిగిన వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరం.
విషం నూరిపోస్తున్నరు
కొందరు బడాబాబులకు ఆర్టీసీని అమ్మేయడానికి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నరు. నెపాన్ని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలపై నెట్టి చేతికి మట్టి అంటకుండా ఆర్టీసీని హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. అందుకే ఎవరెన్ని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ ప్రైవేటీకరణలో ప్రధాన అడ్డంకి కార్మిక సంఘాలే. అందుకే వాటిని అంతమొందించేందుకు సంఘాలపై ప్రజల్లో విషం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులకు సైతం అధికారులతో తప్పుడు నివేదికలు ఇప్పించిన ఘనుడు కేసీఆర్. సమ్మె మొదలై నెల రోజులు కావస్తున్నా, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా కేసీఆర్ కు చీమకుట్టినట్టయినా లేదు. కోర్టులు ఏం చేయగలవన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇలాగే అడ్డగోలుగా, అనుయాయులకు ఆస్తులు దోచిపెట్టి, అవినీతికి పాల్పడిన చాలా మంది జైళ్లలో ఊచలు లెక్కబెట్టారు. కేసీఆర్ కు కూడా ఆ గతి పట్టడం ఖాయం.’’
