
సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తీసేస్తాననడం సీఎం కేసీఆర్ కు తగదని కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శనివారం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ ఉద్యంలో ఒకలా ఇప్పుడు మరొకలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు తన పూర్తి మద్దతును తెలిపారు షబ్బీర్ అలీ.
పది నెలల తర్వాత కేసీఆర్ ప్రధాని మోడీని కలిశారని… బయటకు చెప్పేదొకటి, లోపల మాట్లాడిందొకటని అన్నారు షబ్బీర్. తమ తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని మోడీని కేసీఆర్ వేడుకున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి రిజర్వేషన్ల గురించి మాట్లాడక పోవడంతోనే… కేసీఆర్ మోసపూరిత బుద్ధి బయటపడిందని అన్నారు. 22 డిమాండ్లలో రిజర్వేషన్లు అంశం ఎందుకు లేదని ప్రశ్నించారు.
హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన TRS నాయకులను అడ్డుకోండని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ కు ఉద్యోగులు, ఆర్టీసీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎలర్జీ అని అన్నారు. కేటీఆర్..ది నోరా.. మొరా అని అన్నారు షబ్బీర్ అలీ. కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్దం కావడం లేదని….. సీపీఐని తోక పార్టీ అని అన్న కేటీఆర్.. ఇప్పుడు అదే తోక పార్టీ తోనే జత కట్టారని చెప్పారు.