ఎన్నికలకు జానా దూరం.. కొడుకులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు 

ఎన్నికలకు జానా దూరం.. కొడుకులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు 

నల్గొండ, వెలుగు   :  కాంగ్రెస్  సీనియర్​ నేత, మాజీ సీఎల్పీ లీడర్​కుందూరు జానారెడ్డి  వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన ఇద్దరు కొడుకులకు  రాజకీయంగా లైన్​ క్లియర్​ చేసేందుకు ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. నల్గొండలో శుక్రవారం మీడియా  చిట్ చాట్​లో  ఆయన  ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తే లేదని, పరిస్థితులు సహరిస్తే  సీఎం పదవి వదులుకోనని తేల్చిచెప్పారు.  

కొడుకులకు లైన్​ క్లియర్​ చేసేందుకే ?  

70 ఏండ్ల  వయసున్న జానారెడ్డి ఇటీవల కొంత అనారోగ్యానికి గురయ్యారు. తన కొడుకులను బరిలోకి  దింపడానికి ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని ఆయన కొడుకులు జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఈ విషయంలో జానారెడ్డిపై కొడుకుల నుంచి ఒత్తిడి కూడా ఉందని అంటున్నారు.  ఇటీవల నాగార్జునసాగర్​కు చెందిన ముఖ్యనేతలతో జరిగిన భేటీలో వచ్చే ఎన్నికల్లో జయవీర్, రఘువీర్ పోటీ చేస్తారని జానారెడ్డి చెప్పినట్టు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి అనేక పదవులు నిర్వహించారు.  2014 లో  కాంగ్రెస్​ పవర్​లోకి వస్తే ఆయన సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్​ కూడా అధికారంలోకి రాలేక
పోయింది.

ఉప ఎన్నికలతో మారిన సీన్​...

2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్​లో జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది.  2021  ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పుడే రాజకీయాల నుంచి  రిటైర్మెంట్ ​ప్రకటించారు. కానీ, రేవంత్​రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడంతో ఆయన  పార్టీలో యాక్టివ్​ అయ్యారు.  ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్​ గ్రూపులను సమన్వయం చేయడంలో జానారెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో తన వారసులను బరిలో దింపేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దామోదర్​ రెడ్డిల మధ్య సీట్లకు సంబంధించి సయోధ్య కుదిరితే జయవీర్, రఘువీర్​లకు అవకాశం దొరకవచ్చునని అంటున్నారు.  బీఆర్​ఎస్, సీపీఎం మధ్య పొత్తు ఉండీ..  మిర్యాలగూడను  సీపీఎంకు వదిలితే  రఘువీర్​అక్కడ నుంచి  పోటీ చేయడం ఖాయమని పార్టీ సీనియర్లు అంటున్నారు. జయవీర్ రెడ్డి మాత్రం నాగార్జునసాగర్​ నుంచే బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఉప ఎన్నికల నాటి నుంచే జయవీర్ సాగర్ లో పార్టీ లీడర్లు,  ప్రజలతో  టచ్​లో ఉంటున్నారు. రఘువీర్​ రెడ్డి మిర్యాలగూడలో క్యాంప్​ ఆఫీసు ఓపెన్​ చేశారు. మిర్యాలగూడలో జరిగే అన్ని కార్యక్రమాల్లో  తండ్రితో కలిసి పాల్గొంటున్నారు. 

సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా 

ఎమ్మెల్యేగా పోటీ చేయను, పార్టీ హైకమాండ్​ ఆఫర్​ చేస్తే  సీఎం పదవి స్వీకరిస్తానని జానారెడ్డి మీడియా చిట్​చాట్​లో   తెలిపారు. సీఎం అయితే  తన కొడుకు గెలిచిన స్థానం నుంచి రాజీనామా చేయించి తాను పోటీ చేస్తానన్నారు. అవసరమై తే ఉత్తమ్​ తన కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుంటాడని చెప్పగా..  ఉత్తమ్​ కూడా అంగీకారం తెలిపారు.