కాంగ్రెస్‌కు RSS లాంటి శిక్షణ సంస్థ కావాలి: జానారెడ్డి

కాంగ్రెస్‌కు RSS లాంటి శిక్షణ సంస్థ కావాలి: జానారెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అనూహ్య తీర్పు ఇచ్చారన్నారు. జనాలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారు నియంతృత్వ వాదానికి చెక్ పెట్టారన్నారు. TRS పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారన్నారు. ఏపీలో అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

లాబీయింగ్ అంటే తెలియదు

తాను టికెట్ కోసం, మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేశానని ఓ పత్రికలో వచ్చిన వార్తను ఖండించారు జానారెడ్డి. నలబై ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు లాబీయింగ్ చేయలేదని,   తనకు లాబీయింగ్ అనే పదం కూడా తెలియదని అన్నారు.88 సీట్లు గెలిచిన తరువాత కూడా trs పార్టీ పిరాయింపులతో అప్రజాస్వామికంగా పాలన చేస్తుందని ఆయన అన్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా భట్టి చేస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జానా అన్నారు.

రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని ఉంది

ప్రజలు కోరితే  2024 లో పోటీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని ఉందని జానా అన్నారు. తన ఆలోచన విధానాన్ని నిలబెట్టే తన వారసుడు రాజకీయాల్లో వస్తాను అంటే తండ్రిగా సంతోషిస్తానని జానారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ను ముందు ఉంచి పోరాటం చేస్తే మహాకూటమి గెలిచేదన్నారు జానారెడ్డి. ఎవరికి వారు ప్రధానమంత్రి కావాలని చూసారు కానీ మహాకూటమి అధికారంలోకి రావాలని ఎవరు చూడలేదని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మూలాల దెబ్బతిన్నాయని, మళ్లీ కింది స్థాయి నుంచి యువతరంతో కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేయాలని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. వారికి RSS ఉంది కాబట్టి  అందులో  ఎప్పటికప్పుడు నాయకులు తయారవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి క్రమశిక్షణతో కూడిన యువతరం ఉండాలన్నారు.అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా పై పునరాలోచన చేసుకోవాలని జానా కోరారు.