
హరారే: జింబాబ్వే ఆతిథ్యం ఇచ్చిన టీ20 ట్రై సిరీస్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 3 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తొలుత కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (27 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), డెవాన్ కాన్వే (31 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 47) సత్తా చాటగా.. టిమ్ సిఫర్ట్ (30) కూడా రాణించాడు. మార్క్ చాప్‌మన్ (3) ఫెయిలైనా.. చివర్లో డారిల్ మిచెల్ (16 నాటౌట్), మైఖేల్ బ్రేస్‌వెల్ (15) విలువైన రన్స్ చేశారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 177/6 స్కోరు చేసి ఓడింది.
ఓపెనర్లు లువాన్ డ్రి ప్రిటోరియస్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), రీజా హెండ్రిక్స్ (31) తొలి వికెట్‌కు 92 రన్స్ జోడించి మంచి ఆరంభం దక్కిన తర్వాత కూడా సఫారీ టీమ్ డీలా పడింది. చివర్లో డెవాల్డ్ బ్రేవిస్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ (2/19) సూపర్ బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. టోర్నీ మొత్తంలో పది వికెట్లు తీసిన అతనికే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది.