
బసెటెరీ (సెయింట్ కిట్స్): టిమ్ డేవిడ్ (37 బాల్స్‌లో 6 ఫోర్లు, 11 సిక్స్‌లతో 102 నాటౌట్) ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. దాంతో శుక్రవారం రాత్రి జరిగిన మూడో టీ20లో కంగారూ టీమ్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మిగిలి ఉండగానే ఆసీస్ 3–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 214/4 స్కోరు చేసింది. షై హోప్ (57 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) సెంచరీకి తోడు బ్రెండన్ కింగ్ (36 బాల్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62) చెలరేగాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 125 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. హెట్‌మయర్ (9), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (12), రొవ్‌మన్ పావెల్ (9) ఫెయిలయ్యారు. నేథన్ ఎలిస్, ఆడమ్ జంపా, మిచెల్ ఒవెన్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 16.1 ఓవర్లలో 215/4 స్కోరు చేసి నెగ్గింది.
మిచెల్ మార్ష్ (22), మ్యాక్స్‌వెల్ (20), జోస్ ఇంగ్లిస్ (15), కామెరూన్ గ్రీన్ (11) నిరాశపర్చడంతో ఆసీస్ 87/4 తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన డేవిడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మిచెల్ ఓవెన్ (16 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) ఐదో వికెట్‌కు 128 రన్స్ జోడించి ఈజీగా గెలిపించారు. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌ను బౌండ్రీగా మలిచి డేవిడ్ కెరీర్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. 37 బాల్స్‌లోనే వంద మార్క్‌ను సాధించిన డేవిడ్.. జోస్ ఇంగ్లిస్ (43 బాల్స్) రికార్డును అధిగమించాడు. ఐసీసీ మెంబర్స్ పరంగా డేవిడ్‌ది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. 2017లో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బాల్స్‌లోనే ఈ ఫీట్ సాధించారు.