
సోలో (ఇండోనేసియా): హైదరాబాద్ యంగ్ షట్లర్ కలగోట్ల వెన్నెల.. బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఇండివిడ్యువల్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో వెన్నెల 15–21, 18–21తో లియు సి య (చైనా) చేతిలో ఓడింది. 37 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓ మాదిరిగా ఆడిన తెలుగమ్మాయి రెండో గేమ్‌లో పోటీ ఇచ్చింది. 15–20 స్కోరుతో వెనకబడిన దశలో మూడు మ్యాచ్ పాయింట్లు కాచుకుని ఆశలు రేకెత్తించింది. కానీ చివర్లో లియు కొట్టిన స్మాష్‌లు తీయలేక గేమ్‌ను, మ్యాచ్‌ను చేజార్చుకుంది.
మరో సెమీస్‌లో రెండోసీడ్ తన్వీ శర్మ 13–21, 14–21తో ఎనిమిదో సీడ్ యిన్ యి క్వింగ్ (చైనా) చేతిలో కంగుతిన్నది. 35 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయిన తన్వీ రెండో గేమ్‌ను 6–1తో మొదలుపెట్టింది. కానీ ఎర్రర్స్ చేయడంతో క్వింగ్ 8–8తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో ఇద్దరు షట్లర్లు సెమీస్‌చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సింధు తర్వాత ఈ టోర్నీలో మెడల్స్ నెగ్గిన ఇండియన్స్ నిలిచారు.