దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తావా?

దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తావా?

దక్షిణ తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తావా? అంటూ సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు కాంగ్రెస్ నేత నాగం జనార్ధ‌న్ రెడ్డి. ఏపీ సీఎం జ‌గ‌న్‌ ‌తో కుమ్మ‌క్కై‌ రాజకీయ భిక్ష పెట్టిన మహబూబ్ నగర్ కే అన్యాయం చేస్తావా.? అని మండిప‌డ్డారు. పోతిరెడ్డిపాడు నుండి అధిక మొత్తంలో నీటి తరలింపు కోసం ఏపీ జారీ చేసిన జీవో అంశంపై నాగం జనార్ధ‌న్ రెడ్డి శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… పోతిరెడ్డిపాడు అంశంపై సీఎం కేసీఆర్ కు జ‌న‌వ‌రిలోనే లేఖ రాశాన‌ని అయినా స్పందించ‌లేద‌న్నారు. ఈ నెల 5 న మ‌రోమారు లేఖ రాస్తే అప్పుడు స్పందించి స‌మీక్ష జ‌రిపార‌న్నారు.

కేసీఆర్ ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కు అయ్యారని స్పష్టంగా అర్థమవుతోంద‌న్నారు . జగన్ కు మా సహకారం ఉంటుందంటూ గ‌తంలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను మీడియాకు వినిపించారు నాగం. డిసెంబరులోనే పోతిరెడ్డిపాడు ను విస్తరిస్తామని జగన్ ఏపీ అసెంబ్లీ లో ప్రకటించారని, అయినా ఇప్పటివరకు కేసీఆర్ ఆ విష‌యంపై స్పందించడం లేదని అన్నారు.

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు రాష్ట్రాల నీటి వాడకంపై ఒక సబ్ కమిటీ వేసింద‌ని, పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 73900 క్యూసెక్కుల నీటిని ఇప్పటికే వినియోగించుకున్నట్లు సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని అన్నారు. ఈ నివేదికను సీఎం కేసీఆర్ చూసారా? అని ప్ర‌శ్నించారు నాగం.

భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి కి డిస్ట్రిబ్యూషన్ సిస్టం లేనే లేదని, పక్క రాష్ట్రం అదనంగా నీటిని తీసుకువెళుతోందని ఆయ‌న తెలిపారు. తెలంగాణకు కేటాయించిన దానిలో సగం నీటిని కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇది మన ప్రభుత్వ అసమర్థత అని అన్నారు. ” తెలంగాణను ఎండబెట్టడమే నీ పనా. దోకే బాజ్ పనులు ఆపండి కేసీఆర్” అని మండిప‌డ్డారు నాగం.

కేసీఆర్ కుమ్మక్కు అయితే తెలంగాణ వచ్చేది కాదని మంత్రులు అంటున్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు.. మంత్రులెవ్వరికి వ్యక్తిత్వం లేదు. కేసీఆర్ ను చూస్తేనే మంత్రులకు లాగులు తడుస్తాయని ఆయ‌న‌ అన్నారు

ప్రాజెక్టులకు దేవతల పేర్లు పెట్టి కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడని , పోతిరెడ్డిపాడు లో తట్టెడు మట్టి తీసినా కేసీఆర్ రాజీనామా చేయాలని నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.