అదానీ గ్రూప్ ప్రజలను దోచుకుంటోంది : రాహుల్ గాంధీ

అదానీ గ్రూప్ ప్రజలను దోచుకుంటోంది : రాహుల్ గాంధీ
  • బొగ్గు దిగుమతికి ఖర్చు ఎక్కువ చేస్తున్నది: రాహుల్ గాంధీ
  • ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ఫైర్

న్యూఢిల్లీ: దేశ ప్రజలను అదానీ గ్రూప్ దోచుకుంటున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరలకు బొగ్గును దిగుమతి చేసుకున్నట్లు చూపి కరెంట్ చార్జీలను పెంచిందని తెలిపారు. ఈ విధంగా దేశంలోని పేద ప్రజల జేబు నుంచి అదానీ గ్రూప్  రూ.12 వేల కోట్లను కాజేస్తున్నదని వెల్లడించారు. బుధవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ అనే ప్రముఖ ఆర్థిక దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ అదానీ గ్రూప్, బొగ్గు ధరలు, మోదీ సర్కార్ నిర్ణయాలపై పలు ఆరోపణలు చేశారు.

దేశ ప్రజలను కరెంట్ చార్జీల పేరిట అదానీ గ్రూప్ దోచుకుంటున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. వెంటనే అదానీ గ్రూప్ పై దర్యాప్తు చేపట్టి ప్రజలకు తన పట్ల ఉన్న నమ్మకాన్ని మోదీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 

ఓవర్ ఇన్‌వాయిస్ చేస్తున్నరు  

అదానీ గ్రూప్ ఇండోనేషియాలో  బొగ్గును కొనుగోలు చేస్తున్నదని.. అది భారత్‌కు చేరే సమయానికి ధర రెట్టింపు అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఓవర్ ఇన్‌వాయిస్  చేయడం వల్ల దేశంలోని విద్యుత్ ధరలపై ప్రభావం పడుతున్నదని తెలిపారు. పేద ప్రజలకు ఎక్కువ కరెంట్ బిల్లు వేసి వసూలు చేస్తున్నారని..ఇలా రూ. 12 వేల కోట్లను అదానీ గ్రూప్ సంపాదించుకుంటున్నదని ఆరోపించారు. దీంతో కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పేదలకు సబ్సిడీలు చెల్లించాల్సి వస్తున్నదన్నారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ ధరల వెనుక అదానీ గ్రూప్ కుట్ర ఉందని వెల్లడించారు. ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించిన ఈ కథనం ఏ ప్రభుత్వాన్ని అయినా పడగొట్టేదన్నారు. కానీ మన దేశంలో అలా జరగదని చెప్పారు.