ఈవీఎంలలో రాజు ప్రాణం .. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శ

ఈవీఎంలలో రాజు ప్రాణం .. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శ

ముంబై: రాజు ప్రాణం ఎలక్ట్రానిక్  ఓటింగ్  మెషీన్లలో(ఈవీఎం) దాగి ఉందని ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈవీఎంలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన చేపట్టిన భారత్  జోడో న్యాయ్  యాత్ర ఆదివారం ముంబైలో ముగిసింది. ముంబైలో ఛత్రపతి శివాజీ మహరాజ్  విగ్రహానికి రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. అనంతరం శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే స్మారకాన్ని దర్శించి బాల్ ఠాక్రేకు అంజలి ఘటించారు. తర్వాత మణిభవన్  నుంచి క్రాంతి మైదాన్  వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం శివాజీ పార్కులో జరిగిన బహిరంగ సభలో రాహుల్  మాట్లాడారు. దేశంలోని ఈడీ, సీబీఐ, ఐటీ వంటి వ్యవస్థలే  ప్రధాని మోదీ బలమని ఆయన మండిపడ్డారు. ‘‘హిందుత్వంలో శక్తి(అధికారం) అనే మాట ఉంది. ప్రస్తుతం మేము ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మీడియా కూడా ఆ శక్తిని ప్రశ్నించలేకపోతోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు, అగ్నివీర్  వివాదం వంటి అంశాలను మీడియా లేవనెత్తడం లేదు. అసలు ఆ సమస్యలే మీడియాకు కనిపించడం లేదు. అందుకే వాటిపై మేం గళమెత్తుతున్నాం. అలాగే, ఆ శక్తిని ఎదిరించలేకపోతున్నామని ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన ఓ నేత మా అమ్మ సోనియా వద్ద వాపోయారు. ఆ శక్తిని ఎదిరిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే చాలెంజ్ చేయలేదని ఆయన చెప్పారు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం ఉందా?

రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు అదేపనిగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వాస్తవానికి రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం కమలం పార్టీ నేతలకు లేదని రాహుల్  ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్ సభ, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలని బీజేపీ ఎంపీ అనంత్  కుమార్  చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సత్యం, దేశ ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రెండింటిపై పోరు జరుగుతోందని, కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదన్నారు. ‘‘కేంద్రం నుంచి దేశాన్ని పాలించాలని ఒకరు అనుకుంటారు.

కానీ, అధికార వికేంద్రీకరణ జరగాలని, ప్రజల గొంతుకలు వినాలని  మేము కోరుకుంటాం. ఒక వ్యక్తికి ఐఐటీ డిగ్రీ ఉన్నంతమాత్రాన ఆ వ్యక్తికి ఒక రైతు కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉన్నట్లు భావించడం సరికాదు.కానీ, బీజేపీ అలా అనుకోదు. ఒక వ్యక్తికే జ్ఞానం ఉంటుందని బీజేపీ, ఆరెస్సెస్  అనుకుంటాయి. రైతులు, శ్రామికులు, నిరుద్యోగులకు జ్ఞానం ఉండదని అవి ఆలోచిస్తాయి” అని రాహుల్  వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలు ఎంకే స్టాలిన్, ఆర్జేడీ లీడర్  తేజస్వీ యాదవ్, శివసేన (ఉద్ధవ్  వర్గం) చీఫ్​ ఉద్ధవ్  ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

విద్వేష భావజాలంపైనే మా పోరాటం: తేజస్వీ

తమ పోరాటం విద్వేష భావజాలంపైనే తప్ప ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్  షా వ్యక్తిగత విషయాలపై కాదని రాష్ట్రీయ జనతాదళ్  నేత తేజస్వీ యాదవ్  అన్నారు. మోదీని అబద్ధాల తయారీదారు, హోల్ సేలర్, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన అభివర్ణించారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను పార్టీని వీడేలా మాత్రమే చేస్తారని, కానీ బిహార్ లో తన తండ్రిని బీజేపీ హైజాగ్  చేసిందని ఆయన ఆరోపించారు. బిహార్  సీఎం నితీశ్  కుమార్ పైనా ఆయన విమర్శలు చేశారు. ఆర్జేడీని నితీశ్  మోసంచేసి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థల సాయంతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొడుతున్నారని తేజస్వీ విమర్శించారు.

బీజేపీ అవినీతే ఎలక్టోరల్  బాండ్లు: స్టాలిన్

ఎలక్టోరల్  బాండ్లు బీజేపీ అవినీతి అని తమిళనాడు సీఎం స్టాలిన్  అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి కేంద్రంలో లౌకిక, సమాఖ్య, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పదేండ్లలో విదేశీ పర్యటనలు, అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమిని చూసి మోదీ భయపడ్డారని, ఆ భయంతోనే తమ కూటమి అవినీతి కూటమిగా ప్రధాని దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాస్తవానికి బీజేపీయే అవినీతి పార్టీ అని ఎలక్టోరల్  బాండ్లు నిరూపించాయన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలు బలప్రదర్శన చేశారు.