న్యూఢిల్లీ: ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, అందుకే వారు ఆలోచించి ఓటేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని నిర్మించేవారికి, నాశనం చేసేవారికి మధ్య భేదాన్ని గుర్తించాలని ఈ మేరకు గురువారం రాహుల్ ట్వీట్ చేశారు. “కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర, అందిస్తాం. రాజ్యాంగం, పౌరుల హక్కులను రక్షిస్తాం. బీజేపీ వస్తే నిస్సహాయులు దోపిడీకి గురవుతారు. నియంతృత్వంరాజ్యమేలుతుంది. అందుకే ఆలోచించి ఓటేయాలి” అని పేర్కొన్నారు.
రాహుల్ కు రూ. 20 కోట్ల ఆస్తులు
రాహుల్ గాంధీ తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. కేరళలోని వయనాడ్ నుంచి బుధవారం నామినేషన్ పత్రాల్లో ఆస్తులను వెల్లడించారు. రూ.9.24 కోట్ల చరాస్తులు, రూ.11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. స్థిరాస్తుల్లో రూ.2.10 కోట్లు వారసత్వంగా వచ్చాయన్నారు. తనకు రూ.49.79 లక్షల అప్పు ఉందని రాహుల్ పేర్కొన్నారు. చేతిలో రూ.55 వేల నగదు ఉందన్నారు. కాగా, గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన ఆస్తుల విలువను రూ.15.88 కోట్లుగా, 2014లో రూ.9.4 కోట్లుగా చూపించారు.