మీ అబద్ధాలతో చరిత్ర మారదు : రాహుల్ గాంధీ

మీ అబద్ధాలతో చరిత్ర మారదు : రాహుల్ గాంధీ
  • ప్రధాని మోదీ కామెంట్లపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ మండిపాటు
  • కాంగ్రెస్ మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్

న్యూఢిల్లీ: బీజేపీ అబద్ధాల ప్రచారంతో అసలు చరిత్ర మారదని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ముస్లిం లీగ్ ను గుర్తుచేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై రాహుల్ బుధవారం ట్విట్టర్​లో మండిపడ్డారు. దేశాన్ని విభజించాలని కోరుకునే శక్తులతో ఎవరు చేతులు కలిపారనేదానికి చరిత్రే సాక్ష్యంగా ఉందన్నారు. ప్రచార సభలు, రాజకీయ వేదికలపై అబద్ధాలు చెప్పడం ద్వారా ఆ చరిత్రను మార్చలేరని అన్నారు. ఇండిపెండెన్స్ కోసం, దేశ సమైక్యత కోసం ఎవరెవరు పోరాడారో, దేశాన్ని డివైడ్ చేయాలనుకునేవాళ్లతో చేతులు కలిపినోళ్లెవరో చరిత్రే చెప్తోందన్నారు.

 ‘‘క్విట్ ఇండియా ఉద్యమం టైంలో బ్రిటిష్ వారి పంచన చేరిందెవరు? స్వాతంత్ర్యం కోసం పోరాడే క్రమంలో దేశంలోని జైళ్లన్నీ కాంగ్రెస్ నాయకులతో నిండినప్పుడు.. దేశ విభజన శక్తులతో కలిసి పనిచేసిందెవరు?”అని రాహుల్ ప్రశ్నించారు. రాజకీయ వేదికలపై అబద్ధాలు చెప్పినంతమాత్రాన చరిత్ర మారదన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. దేశాన్ని ఏకం చేసిన కాంగ్రెస్ ఒకవైపు, ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే వారు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు.