
- కేంద్రంపై ఒత్తిడి తెస్తం
- లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- రైతు సంఘాలతో భేటీ
న్యూఢిల్లీ: మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇండియా కూటమి తరపున కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అయితే, రైతుల్ని లోపలికి అనుమతించే విషయంలో గందరగోళం నెలకొంది. తనను కలిసేందుకు వచ్చిన రైతులను పార్లమెంటులోకి పర్మిషన్ఇవ్వలేదని రాహుల్ ఆరోపించారు. వారిని తన కార్యాలయానికి తానే ఆహ్వానించినట్లు వెల్లడించారు. రైతులు కావడం వల్లే వారిని లోనికి పంపలేదన్నారు. రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికీ రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి పాదయాత్రగా వస్తామని చెప్పారు.