సెబీ చీఫ్ ఎందుకు రాజీనామా చేయలే?: రాహుల్ గాంధీ

సెబీ చీఫ్ ఎందుకు రాజీనామా చేయలే?: రాహుల్ గాంధీ
  • ఇన్వెస్టర్లు నష్టపోతే ఎవరి బాధ్యత?: రాహుల్ గాంధీ 

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమ విదేశీ లావాదేవీల్లో సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బుచ్ కూ వాటాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినా.. ఆమె ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సెబీ చైర్ పర్సన్ పై ఆరోపణలు చేస్తూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ శనివారం రిపోర్ట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆదివారం దీనిపై రాహుల్ ఓ వీడియో విడుదల చేశారు. హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసినట్టుగా నిజం బయటపడు తుందనే అదానీ గ్రూప్ పై జేపీసీ దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని విమర్శించారు. 

సెబీ సమగ్రతపైనే సందేహాలు వచ్చేలా ఆరోపణలు వినిపిస్తున్నా.. ఆ సంస్థ చీఫ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ఇన్వెస్టర్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ‘‘ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే.. ఎవరిది బాధ్యత? ప్రధాని మోదీ, సెబీ చైర్ పర్సన్ లేదా గౌతమ్ అదానీ.. వీరిలో ఎవరు బాధ్యత వహిస్తారు? సెబీ చైర్ పర్సన్ పై తీవ్రమైన ఆరోపణలు తెరపైకి వచ్చినందున ఈ సారి కూడా సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందా? అన్నది కూడా చూడాలి” అని రాహుల్ అన్నారు.