రైతులపై మోదీ నియంతృత్వం.. మండిపడ్డ రాహుల్ గాంధీ

రైతులపై మోదీ నియంతృత్వం.. మండిపడ్డ రాహుల్ గాంధీ

రాయ్‌‌పూర్ :  దేశంలోని  రైతుల పట్ల మోదీ ప్రభుత్వం నియంతృత్వ వైఖరీ అవలంబిస్తున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపడేలా చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు చేపట్టిన ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం 'చలో ఢిల్లీ' మార్చ్‌‌ చేపట్టిన రైతులను శంభు సరిహద్దు వద్ద పోలీసులు, భద్రతా బలగాలు మంగళవారం అడ్డుకున్నారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు. దీనిపై రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో గాయపడి, పాటియాలాలోని రాజ్‌‌పురా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న  పంజాబ్ రైతు గుర్మీత్‌‌ సింగ్‌‌తో బుధవారం ఫోన్‌‌లో మాట్లాడారు. 

అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన వాట్సాప్ చానెల్‌‌లో  షేర్ చేశారు.  " రైతు ఉద్యమంలో పోలీసుల వల్ల గాయపడిన రైతు, మాజీ సోల్జర్ గుర్మీత్ సింగ్‌‌తో ఫోన్‌‌లో మాట్లాడాను. అతనొక యువరైతు. అలాంటి వ్యక్తిని అభినందించడానికి బదులు గాయపరిచారు. గుర్మీత్ సింగ్‌‌ చేతులపై, కంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. తమ హక్కుల కోసం శాంతియుతంగా ఉద్యమం చేపట్టిన రైతులపై దాడి బాధాకరం. అన్నదాత పట్ల మోడీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపడేలా చేస్తున్నది. రైతులకు మేం ఉన్నాం. మీరు(రైతులు) న్యాయం కోసం పోరాడుతున్నారు. శభాష్. బెస్ట్ ఆఫ్ లక్"అని రాహుల్ తన పోస్టులో వివరించారు.