సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్

సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ పరామర్శించనున్నారు. ఈరోజు పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామాన్ని సందర్శించనున్నారు. సోమవారం (జూన్ 6వ తేదీన) రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మూసే వాలా ఇంటికి వెళ్లి ఆయన తండ్రిని కలిశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమ నాయకుడు హత్యకు గురికావడం చాలా బాధాకరమని సచిన్ పైలట్ అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈఘటనపై విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. ఈ మధ్య పంజాబ్ లో డ్రగ్ మాఫియాలు, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు పట్టుబడుతున్నరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో సిద్ధూ మూసే వాలాను దుండగులు కాల్చి చంపారు. సిద్ధూ శరీరంలో 19 బుల్లెట్ గాయాలు ఉన్నాయి. సిద్ధూను కాల్చిన 15 నిమిషాల్లోనే అతడు చనిపోయాడు. సిద్ధూ మూసే వాలా మర్డర్ పై దర్యాప్తును వేగవంతం చేసేందుకు పంజాబ్ పోలీసులు గత వారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. పంజాబ్ పోలీసులు సిద్ధూ భద్రతను ఉపసంహరించుకున్న మరోసటి రోజే ఈ సంఘటన జరిగింది. గాయకుడి మృతి అతడి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.