తిరువనంతపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాస్‌లుగా ఉన్న కుటుంబంలో తాను పెరిగానని చెప్పారు. పురుషుల కంటే మహిళలే తెలివైనవారని పేర్కొన్నారు. ఇటీవల కేరళకు చెందిన విద్యార్థినులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోను శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “మహిళలు బాస్‌లుగా ఉన్న కుటుంబంలో నేను పెరిగాను. మా కుటుంబానికి మా నాన్నమ్మ ఇందిరా గాంధీ బాస్. మా ఇంట్లో నేను ఎప్పుడు మహిళల మధ్యే ఉంటాను’’ అని వెల్లడించారు.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ తెలివైన వారని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు దూరదృష్టితో ఆలోచిస్తారని పేర్కొన్నారు. ప్రతీ మహిళలో అవగాహన, సున్నితత్వం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటాయన్నారు. సమాజం విధించే ఆంక్షలకు లోబడకుండా, మహిళలు తమ సొంత గుర్తింపు, ఆశయాల మేరకు ముందుకు సాగే హక్కు కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
