నానమ్మ నడయాడిన నేలపై మనవడి పాదయాత్ర

నానమ్మ నడయాడిన నేలపై మనవడి పాదయాత్ర

సంగారెడ్డి/రామచంద్రపురం/పటాన్ చెరు, వెలుగు : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో బుధవారం జోరుగా కొనసాగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులపాటు కొనసాగే ఈ యాత్రకు కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. మెదక్​ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయిన ఇందిరా గాంధీ  మనవడు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు ఇక్కడి ప్రజలు నీరాజనం పట్టారు.  బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అయిన ఈ యాత్ర మొదటి రోజు పటాన్ చెరు, ముత్తంగి, రుద్రారం, గణేశ్​గడ్డ వరకు కొనసాగింది. రాహుల్ వెంట కాంగ్రెస్ పార్టీ స్టేట్​చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్, కాటా శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు, బోనాలు, మంగళహారతులతో మహిళలు రాహుల్ గాంధీనికి స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

బీహెచ్ఈఎల్ ఉద్యోగులతో...

సంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే బీహెచ్​ఈఎల్​ ఉద్యోగులు రాహుల్ గాంధీని కలిసి సంస్థ ప్రైవేటైజేషన్ ను ఆపాలని కోరారు. బీహెచ్​ఈఎల్ తో పాటు దేశ రక్షణ సంస్థ అయిన బీడీఎల్ ను కూడా ప్రైవేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాహుల్ తో చెప్పారు. దేశ రక్షణ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రమాదం జరుగుతుందని  ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ సంస్థలను కాపాడాలని కోరారు. 

ట్రాఫిక్ ఆంక్షలు..

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర నేపథ్యంలో జిల్లా పోలీసులు 65వ నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జిల్లా ఎస్పీ రమణ కుమార్ నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచే పాదయాత్ర కొనసాగే దారిలో ట్రాఫిక్ ను మళ్లించారు. సాయంత్రం 4.30 గంటలకు బీహెచ్ఎల్ కు చేరుకున్న రాహుల్ గాంధీ రాత్రి 8 గంటలకు గణేశ్​గడ్డకు చేరుకోగా అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభమై సంగారెడ్డి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి టౌన్, శిశు మందిర్ వరకు రెండో రోజు పాదయాత్ర కొనసాగనున్నది. ఇక్కడ కూడా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.

చాయ్ తాగుతూ...

జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పటాన్ చెరులోని ఓ కేఫ్ లో చాయ్ తాగి కాసేపు సేద తీరారు. హోటల్ నిర్వహణ తోపాటు అందులో పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడే కొద్దిసేపు పిల్లలతో ఫుట్ బాల్ ఆడాడు. అనంతరం పాదయాత్ర కొనసాగించిన రాహుల్ దారి పొడవున ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర ముత్తంగి చౌరస్తా వరకు చేరుకోగానే అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత రుద్రారం మీదుగా గణేశ్​ గడ్డ వరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్యామ్​యానాలో రాత్రికి బస చేశారు.