ఆర్టీసీ సమ్మె: దేశంలోనే తెలంగాణ విచిత్ర రాష్ట్రంగా మారింది

ఆర్టీసీ సమ్మె: దేశంలోనే తెలంగాణ విచిత్ర రాష్ట్రంగా మారింది

తెలంగాణ దేశంలోనే విచిత్రమైన రాష్ట్రంగా మారిందన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర విభజన తర్వాత మేలు జరుగుతుందని RTC కార్మికులు తమ డిమాండ్లను TRS ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. అయితే వారికి వ్యతిరేకంగా… RTC ని కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల కోరికలు నిజమైనవని.. ప్రాణనష్టం జరుగుతుందనే సమ్మెను విరమించారని అన్నారు. విధుల్లో చేరుతామంటున్న కార్మికులను కాదనడానికి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఎవరని ప్రశ్నించారు.

ఒకవేల కేసీఆర్ ప్రభుత్వం RTCని ప్రైవేటు పరం చేస్తే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ను రద్దు చేస్తామని అన్నారు జగ్గారెడ్డి. ఇందుకు కాంగ్రెస్ పెద్దలను ఒప్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా కేసీఆర్ లేకుండా చేస్తున్నారని చెప్పారు. ప్రతి పక్షాలను కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులందరూ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు జగ్గారెడ్డి. చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, స్వామి గౌడ్, దేవి ప్రసాద్, కారం రవిందర్ రెడ్డి, రాజేందర్, మమత TNGO, TGO నేతలు ఎక్కడ ఉన్నారని అన్నారు. వీళ్లందరికీ చీమూ, నెత్తురు లేదా? ప్రభుత్వంకు  చెంచాగిరి చేస్తున్నారా? అని ఉద్వేగంగా మాట్లాడారు. RTC కార్మికుల పక్షాన నిలవకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.  RTC కార్మికులను, ప్రజలను రెచ్చకొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్లుగా చేసిన ఈ మేధావులు.. ఇప్పడెక్కడ ఉన్నారని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్న…RTC కార్మికుల ఏడుపు మంచిది కాదు…ఇవ్వాళ మీరూ అధికారంలో ఉండొచ్చు పోలీసులు మీ చేతుల్లో ఉండొచ్చు… కానీ అన్ని రోజులు మీవి కావని చెప్తున్నానని అన్నారు.