కేసీఆర్, ఒవైసీ కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారు

కేసీఆర్, ఒవైసీ కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారు

సీఎం కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకి) వ్యతిరేకంగా కొందరు ముస్లిం నేతలను వెంటబెట్టుకుని వెళ్లి ఒవైసీ సీఎంని కలిశారని, ఆ సమయంలో కేసీఆర్ దీనిపై రెండ్రోజుల్లో ప్రకటన చేస్తారని చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన నోరు పెదపలేదని చెప్పారు. గురువారం హైదరాబాద్ లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ 11న పౌరసత్వ సవరణ చట్టం వచ్చిందని, దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర కేబినెట్ కేవలం CAAని వాపస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం మాత్రమే చేసిందని, అసెంబ్లీలోనూ చర్చిస్తామని చెబుతున్నారని అన్నారు. అయితే సీఏఏకి వ్యతిరేకంగా దేశంలోని బీజేపీయేతర పార్టీల నేతలతో రాష్ట్రంలో సభ పెడతానని చెప్పారని, కానీ దానిపై ఇప్పటికీ ఏమాత్రం స్పందన లేదని చెప్పారు. ఒవైసీ, కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఒవైసీ ప్రతి రాష్ట్రం ఓ షాహీన్ బాగ్ కావాలని కోరుకుంటున్నాడని, కానీ హైదరాబాద్ ను అలా కానివ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు షబ్బీర్ అలీ.