జూన్ 27న పార్లమెంట్​ను ముట్టడిస్తం: శివసేనా రెడ్డి

జూన్ 27న పార్లమెంట్​ను ముట్టడిస్తం:  శివసేనా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న పార్లమెంట్ ను ముట్టడిస్తామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. నీట్ పరీక్షను మళ్లీ వెంటనే నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, నిరుద్యోగులు ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. నీట్ లో అన్యాయానికి గురైన 24 లక్షల మంది విద్యార్థులు మోదీ సర్కార్ పై తిరగబడాలని కోరారు. 

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నం 

నీట్ నిర్వహణలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ సోమవారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు పలువురు మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం, తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో పలువురు మహిళా కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ఇందిరా భవన్​లో సమావేశమయ్యారు. 

అక్కడి నుంచి బీజేపీ ఆఫీసు ముట్టడికి వెళ్లేందుకు గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా, మెయిన్ గేట్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. నీట్​పై మోదీతో మాట్లాడానికి జంకుతున్నారని విమర్శించారు. దీనిపై మోదీ స్పందించకపోతే పార్లమెంట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.